వైయస్ అవినీతికి సోనియా కితాబా!: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అవినీతి పాలనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కితాబు ఇచ్చారని తెలుగుదేశం శాసనసభా పక్షం ఉపనాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ పాలనను సోనియా గాంధీ బుధవారం జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రశంసించారు. సోనియా ప్రశంసలను నాగం జనార్దన్ రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో ఎద్దేవా చేశారు.
వైయస్ పాలన అస్తవ్యస్తంగా ఉన్నదని, ఈ స్థితిలో వైయస్ పాలన ఏ విషయంలో మెరుగ్గా ఉందని సోనియా మెచ్చుకున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం సంప్రదాయంగా వస్తున్నదేనని, ఇప్పుడూ అదే జరుగుతోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తన బంధువులకు ఇచ్చిన హామీలను మాత్రమే నిలబెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ల నియామకం నుంచి అన్ని విషయాల్లోనూ సోనియా గాంధీయే నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన అంటూ సోనియా చేసిన త్యాగమేమిటని అడిగారు.












Click it and Unblock the Notifications