విశాఖ జిల్లాలో ఎన్‌కౌంటర్: ముగ్గురు నక్సల్స్ పరారీ
హైదరాబాద్: విశాఖపట్నం పట్రాయి సమీపంలోని సీలేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. సంఘటనా స్థలం నుంచి తుపాకిని, ఒక తపంచాను, రెండు కిట్ బ్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం పంగిడిమాదారంలో రోడ్డు పనులు చేస్తున్న మూడు ప్రొక్లెయిన్లను, 12 ట్రాక్టర్లను మావోయిస్టులు దహనం చేశారు. పంగిడి మాదారం అటవీ ప్రాంతంలో పోలీసులు నక్సల్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక స్కూటర్‌ను కూడా దహనం చేశారు. రోడ్డు పనులు చేస్తున్న ఏజెంట్ సెల్‌ఫోన్‌ను నక్సల్స్ తీసుకెళ్లారు.
కాగా, ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) మహేష్‌చంద్ర లడ్హాపై దాడికి మానవబాంబును ప్రయోగించలేదని మావోయిస్టులు ప్రకటించారు. దాడి సందర్భంగా మరణించింది సాధారణ పౌరుడేనని స్పష్టం చేశారు. యస్పీపై మావోయిస్టుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మరో వ్యక్తి అస్పత్రిలో మరణించినట్లు సమాచారం. దీంతో ఈ దాడిలో మరణించినవారి సంఖ్య మూడుకు చేరుకుంది. నల్లమల అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications
