ఇప్పటివరకు సొంతిల్లు లేని తెలుగు స్టార్ హీరోలు
గ్లామర్, గ్లాస్ మేడలు, వందల కోట్ల ఆస్తులు.. సగటు మనిషి దృష్టిలో సినిమా ప్రపంచం అంటే ఒక రంగుల కల. "జీవిస్తే ఇలాంటి లగ్జరీ లైఫ్ బతకాలి" అని ప్రతి సామాన్యుడు అనుకోవడంలో వింతేమీ లేదు. అయితే ఆ కాంతివంతమైన తెర వెనుక చేదు నిజాలూ ఉన్నాయి. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటూ, స్టార్ హోదా అనుభవిస్తూ కూడా సొంత ఇల్లు నిర్మించుకోలేకపోయిన హీరోలతో పాటు, కష్టకాలంలో ఉన్న ఇంటిని అమ్మేసుకున్న దిగ్గజ తారలూ టాలీవుడ్‌లో ఉన్నారు.
ముందుగా ఆర్.నారాయణమూర్తి
ఈ జాబితాలో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు 'రెబెల్ స్టార్' ఆర్. నారాయణమూర్తి. 'ఎర్ర సైన్యం' లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో కోట్లు వసూలు చేసినా, వచ్చిన డబ్బునంతా ఆస్తుల్లో పెట్టకుండా మళ్లీ సినిమాల నిర్మాణానికే ఖర్చు చేశారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ ఉన్నా ఆయన ఇప్పటికీ సొంతంగా ఇల్లు కట్టుకోలేదు. ఇక కుర్ర హీరో రాజ్ తరుణ్ వరుస హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఒక ఇల్లు కొనుగోలు చేశారు.

కానీ ఆ ఇంటిని తన మాజీ ప్రియురాలికి ఇవ్వాల్సి రావడంతో, ప్రస్తుతం సరైన విజయాలు, రెమ్యునరేషన్లు లేక ఆయన అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు ఒక్కో సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్న నవీన్ పొలిశెట్టికి ఇప్పటివరకు హైదరాబాద్‌లో సొంత నివాసం లేదు. అలాగే యువ హీరో సంతోష్ శోభన్, ఆయన సోదరుడు సంగీత్ శోభన్ తమ తండ్రి (దివంగత దర్శకుడు శోభన్) నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నారు తప్ప, సొంతంగా వేరే ఇల్లు నిర్మించుకోలేదు.

కష్టకాలంలో అమ్ముకున్నారు
సొంత ఇల్లు లేకపోవడం ఒకెత్తయితే, కష్టకాలంలో ఉన్న ఇంటిని అమ్మేసుకున్న దిగ్గజాలూ ఉన్నారు. తన సోదరుడు నాగబాబు చిత్ర నిర్మాణంలో తీవ్ర నష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తన సొంత ఇంటిని అమ్మేసి అండగా నిలిచారు. అనంతరం కొన్నాళ్ల పాటు అపార్ట్‌మెంట్‌లో అద్దె ఫ్లాట్‌లోనే నివసించారు. అలాగే 'నిర్మాతల హీరో'గా పేరుగాంచిన నటశేఖర కృష్ణ సొంతంగా నిర్మించిన కొన్ని భారీ చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఎంతో ఇష్టపడి కట్టుకున్న 'పద్మాలయ స్టూడియోస్'ను మూసివేయడమే కాకుండా, తన సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. మహేష్ బాబు స్టార్‌గా నిలదొక్కుకునే వరకు ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పర్‌ఫెక్ట్ లైఫ్ గడుపుతున్నారనుకునే సినీ సెలబ్రిటీల జీవితాల్లోనూ మనలాగే ఆర్థిక ఒడిదొడుకులు, సవాళ్లు ఉంటాయనడానికి ఈ సంఘటనలే నిదర్శనం!














Click it and Unblock the Notifications
