Vinayaka Chavithi: భక్తి నీడన బతుకు సమరం: శిల్పకారుల కన్నీటి గాథ
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. తెలుగు నేలమంతా ఒక రకమైన ఆధ్యాత్మిక పులకరింతతో ఊగిపోతుంది. గల్లీ గల్లీలో వెలిసే పందిళ్లు, ఆకాశాన్ని తాకే ఎత్తులో కొలువయ్యే భారీ విగ్రహాలు, చూపరులను కట్టిపడేసే వర్ణాల ఆర్భాటం.. ఇదీ మనకు కనిపించే బాహ్య ప్రపంచపు పండుగ కోలాహలం. కానీ, ఈ రంగుల కన్నుల పండుగ వెనుక, అద్భుత ప్రతిమలను చెక్కే చేతుల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. ఉత్సవాల వేళ కోట్లాది మంది ఇళ్లలో వెలుగులు నింపే ఆ విఘ్నేశ్వరుడి రూప శిల్పుల జీవితాలు మాత్రం ఏటా అప్పుల ఊబిలో, అనారోగ్యపు చీకట్లలోనే మగ్గుతున్నాయి.
మార్కాపురం జిల్లా కేంద్రంలో పెద్ద పరిమాణంలో, తేలికపాటి బరువుతో, తక్కువ వ్యయంలో దొరికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) విగ్రహాలకే ఉత్సవ కమిటీలు ఆసక్తి చూపిస్తున్నాయి.అయితే,ఈ ఆకర్షణీయ ప్రతిమల తయారీ వెనుక తయారీదారులు చెల్లిస్తున్న మూల్యం సామాన్యమైనది కాదు.తెల్లటి పీఓపీ పౌడర్,కెమికల్ రంగుల పొగలు,ఆవిర్లు కక్కే షెడ్ల మధ్య శిల్పులు రోజంతా శ్రమిస్తారు.ఊపిరి పీల్చుకున్న ప్రతిసారీ వారి ఊపిరితిత్తుల్లోకి చేరే విషపూరిత ధూళి..ఆస్తమా,శ్వాసకోశ వ్యాధులు,చర్మ రోగాలను బహుమతిగా ఇస్తోంది.మన కళ్లను మైమరిపించే ఆ రంగుల వెనుక,ఒక శిల్పి ఆరోగ్యం నిశ్శబ్దంగా కరిగిపోతోందన్న సత్యం ఎందరికి తెలుసు?

పెరిగిన పెట్టుబడులు.. గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మార్కెట్ అభద్రత
ఒక్కో భారీ విగ్రహం తయారీకి లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.ఇటీవలి కాలంలో పీఓపీ,ఇనుప తీగలు,గడ్డి,రసాయన రంగుల ధరలు చుక్కలనంటాయి.దీనికితోడు షెడ్ల అద్దెలు,రవాణా చార్జీలు క్రమంగా తయారీదారుల నడుం విరుస్తున్నాయి.రూపాయి రూపాయి కూడబెట్టి,వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారంలో పెడతారు.పండుగ నాటికి ఆ విగ్రహాలు పూర్తిగా అమ్ముడుపోతేనే వారి శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. వాతావరణం సహకరించక వర్షాలు పడినా,లేదా విగ్రహాలు మిగిలిపోయినా..ఆ కుటుంబాలు ఘోరమైన ఆర్థిక నిరాశలో కూరుకుపోతాయి.భక్తితో మొదలయ్యే సీజన్, వారి పాలిట రుణగ్రస్థతతో ముగుస్తోంది.
పర్యావరణానికి కోలుకోలేని దెబ్బ
ఈ మానవ శ్రమ కోణంతో పాటు,ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ప్రకృతికి జరుగుతున్న నష్టం తీవ్రమైన పర్యావరణ సంక్షోభానికి దారితీస్తోంది.నీటిలో సులభంగా కరగని పీఓపీ,ఏళ్ల తరబడి చెరువులు,నదుల అడుగుభాగంలో పూడికలా పేరుకుపోతుంది.ఆ విగ్రహాలకు వాడే పెయింట్లలో ఉండే సీసం (Lead),కాడ్మియం,మెర్క్యురీ వంటి భార లోహాలు జలాశయాలను విషతుల్యం చేస్తున్నాయి.ఫలితంగా జలచరాలు మృత్యువాత పడటమే కాక,ఆ నీటి వనరుల ద్వారా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది.
పరిష్కారం ఎక్కడ? సంస్కృతిని, శిల్పిని, ప్రకృతిని కాపాడుకునే మార్గం
భక్తి ఉత్సవాలను ఆపలేం,ఆపకూడదు.కానీ ఆ భక్తి పర్యావరణానికి శాపంగా,శిల్పి జీవితానికి శోకంగా మారకూడదు.ఇక్కడ ప్రభుత్వం, సమాజం ఉమ్మడిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలకు నిషేధం విధించి చేతులు దులుపుకోవడం కాకుండా,సాంప్రదాయ శిల్పులకు నాణ్యమైన మట్టి, సహజసిద్ధమైన రంగులను ప్రభుత్వం సబ్సిడీ ధరలపై అందుబాటులోకి తీసుకురావాలి.
మట్టితో కూడా ఆకర్షణీయమైన,పెద్ద విగ్రహాలను వేగంగా తయారు చేసే విధంగా శిల్పులకు ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వాలి.బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించాలి.భక్తులు, గణేష్ ఉత్సవ మండలి నిర్వాహకులు కేవలం 'ఎత్తు, రంగు'ల ఆధారంగా కాకుండా,పర్యావరణహిత మట్టి ప్రతిమలనే ప్రతిష్టించేలా మానసిక మార్పు సాధించాలి.
ఒక వైపు సంప్రదాయాన్ని కాపాడుకుంటూ,మరోవైపు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ విఘ్నేశ్వరుడి రూపానికి ప్రాణం పోసే శిల్పకార కుటుంబాల బతుకుల్లో వెలుగులు నింపడం కూడా అంతే ముఖ్యం.దేవుడికి పూజలు చేసే సమాజం,ఆ దేవుడిని తయారు చేసే చేతులకు భరోసా ఇచ్చినప్పుడే నిజమైన పండుగ శోభ చేకూరుతుంది.












Click it and Unblock the Notifications
