యన్‌డిఎతో విభేదించిన టిడిపి: పార్లమెంటుకు హాజరు
న్యూఢిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ)తో విభేదించి తెలుగుదేశం పార్టీ గురువారంనాడు పార్లమెంటు సమావేశాలకు హాజరైంది. పార్లమెంటు సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలనే యన్‌డి ఎ నిర్ణయంతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ విభేదించింది. పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని తమ పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు విలేకరులకు చెప్పారు.
ప్రతిపక్షాల పట్ల ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పార్లమెంటు ఉభయసభల్లోనూ నిరసన వ్యక్తం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రతిపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరించడానికి బదులు పార్లమెంటు బహిష్కరణపై కొందరు కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. యన్‌డి ఎతో విభేదించడంపై విలేకరులు ప్రశ్నించగా తాము యన్‌డి ఎకు అంశాలవారీ ప్రాతిపదికపై మాత్రమే మద్దతు ఇస్తూ వస్తున్నామని ఎర్రంనాయుడు సమాధానమిచ్చారు.
ప్రభుత్వ వైఖరి ఖండించదగినదిగానే ఉన్నదని, స్తంభనను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదని, ఈ స్థితిలో పార్లమెంటు బహిష్కరణ మంచి సంకేతాలను పంపదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
