వైయస్ పాలన చేసిందేమీ లేదు: దత్తాత్రేయ
విశాఖపట్నం: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఏడాది పాలన ప్రజలకు చేసింది శూన్యమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉన్నదని ఆయన శుక్రవారం విలేకరులతో అన్నారు. తెలంగాణ, నక్సలైట్ల అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 3 లక్షల 25 వేల మహిళా సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని కూడా ఆయన అన్నారు. యస్‌సి, యస్‌టి వర్గాల ఇళ్లకు ఒక బల్బు ఉంటే ఉచితంగా విద్యుత్ ఇస్తామన్న హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు.
అధికార పార్టీ అధ్యక్షుడే శాంతి యాత్రలు చేస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అర్థమని ఆయన అన్నారు. శాంతి యాత్రలు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చడానికేనని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డి పీఠానికి ఎసరు ఉంది కాబట్టే తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి కేశవరావు శాంతి యాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన విమర్శించారు. మహాత్మాగాంధీ యాత్రలు, శాంతి యాత్రలు అంటున్నవారు ఫ్యాక్షనిస్టులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
