ప్రేమ వేధింపులతో మహాలక్ష్మి ఆత్మహత్యాయత్నం
విజయవాడ: ప్రేమించాననే ఒక యువకుడి వేధింపులు భరించలేక ఒక అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పసుపుబొట్లపాలెం అనే గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే 19 యేళ్ల యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం గుడివాడ అస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.తాను ప్రేమించానని, పెళ్లి చేసుకుందామని పెసరమిట్లకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సత్యనారాయణ మహాలక్ష్మిని వేధించసాగాడు.
మచిలీపట్నంలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న మహాలక్ష్మి రోజూ బస్సులో వెళ్లి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో సత్యనారాయణ అమె వెంట పడేవాడు. దీంతో ప్రతిరోజు తన తమ్ముడ్ని వెంటబెట్టుకుని మహాలక్ష్మి కళాశాలకు వెళ్లి రావడం సాగించింది. శనివారంనాడు తమ్ముడు ఆమె వెంట లేకపోవడం గమనించిన సత్యనారాయణ మహాలక్ష్మిని తీవ్రంగా బెదిరించాడు. చంపేస్తానని కూడా అన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన మహాలక్ష్మి విచారంగా ఉండడం గమనించి తల్లి ప్రశ్నించింది. తల్లికి ఆమె ఏమీ చెప్పలేదు. అన్నం కూడా తినలేదు. ఎవరికీ తెలియకుండా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుంది.












Click it and Unblock the Notifications