హైదరాబాద్ మెట్రోపై కేంద్రం సూచన.. త్వరలోనే ఆ పనులు షురూ!
హైదరాబాద్ మెట్రో రైలు మొదటిదశ ప్రాజెక్ట్ విలువ నిర్ధారణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కీలక అధ్యయనం కోసం SBI క్యాపిటల్ మార్కెట్స్ (SBI క్యాప్స్) సంస్థను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. మెట్రో స్వాధీనం, ఆర్థిక సమీక్ష, రుణాల సమీకరణ, రెండో దశ విస్తరణతో పాటు సంబంధిత అన్ని అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
SBI క్యాప్స్ మెట్రో విలువ నిర్ధారణ పనులు
కేంద్రం నుంచి అనుమతులు అందిన వెంటనే SBI క్యాప్స్ వచ్చే వారం నుంచి పనులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మరియు చట్టపరమైన మదింపు చేయించింది. ఆ నివేదికల ఆధారంగా ప్రస్తుతం తిరిగి విలువ నిర్ధారణ చేపట్టాలా లేదా పూర్తి కొత్తగా అధ్యయనం చేయాలా అనేది చర్చనీయాంశంగా మారింది.

మెట్రో ఆస్తుల విలువ మదింపు చేసిన ఐడీబీఐ క్యాపిటల్
మెట్రో మొదటి దశను రాష్ట్రం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిన తర్వాత టెండర్ ద్వారా ఐడీబీఐ క్యాపిటల్‌ను ఎంపిక చేశారు. ఆ సంస్థ మెట్రో ఆస్తులు, భూములు, మాల్స్ వంటి వాటి విలువను రూ.19,136 కోట్ల నుంచి రూ.22,102 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది. అదే సమయంలో ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్ సాంకేతిక అంశాలను పరిశీలించి నివేదిక అందించింది.
కేంద్రం సూచనలతో మెట్రో విలువ నిర్ధారణకు ఎస్బీఐ క్యాప్స్
ఈ నివేదికల ఆధారంగా మంత్రిమండలి ఆమోదంతో ఎల్‌అండ్‌టీ నుంచి రూ.15,000 కోట్లకు వాటా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఏప్రిల్ 29న అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది.SBI క్యాప్స్ గతంలో రాష్ట్రం పిలిచిన టెండర్లలో పాల్గొన్నప్పటికీ అధిక ధర కారణంగా ఎంపిక కాలేదు. ఇప్పుడు కేంద్ర సూచనల మేరకు ఈ సంస్థను ఎంచుకున్నారు.
నిజాం షుగర్స్ టేకోవర్ సమయంలో విలువ మదింపు చేసిన ఎస్ బీ ఐ క్యాప్స్
నిజాం షుగర్స్ టేకోవర్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్న ఈ సంస్థ ప్రస్తుత మదింపులో కూడా మెట్రో విలువలో పెద్ద మార్పులు సూచించదని అధికారులు భావిస్తున్నారు. భూముల విలువల్లో స్వల్ప మార్పులు తప్ప ప్రాజెక్ట్ మొత్తం విలువలో గణనీయమైన తేడా ఉండదని వారు తెలిపారు. ఇటీవల సచివాలయంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు భేటీ అయ్యారు.
కేంద్రం మరియు రాష్ట్రం కలిసి మెట్రోప్రాజెక్టుపై కీలకఅడుగు
మెట్రో ఎండీ, పురపాలక శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన చర్చల వివరాలను ఎల్‌అండ్‌టీ అధికారులకు తెలియజేశారు. కేంద్రం మరియు రాష్ట్రం కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మెట్రో ప్రాజెక్టు మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అధ్యయనం పూర్తి కావడంతో మెట్రో సేవలు మెరుగుపడి, ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు బలం చేకూరుతుంది.













Click it and Unblock the Notifications