అసెంబ్లీలో చంద్రబాబు సహా టిడిపి సభ్యుల ధర్నా
హైదరాబాద్: వరి మద్దతు ధరపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సోమవారం శాసనసభలో ధర్నాకు దిగారు. వరికి మద్దతు ధరపై జరిగిన చర్చకు సమాధానం ఇవ్వకుండా సభను అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వారు స్పీకర్ పోడియం వద్ద ధర్నాకు దిగారు. చర్చకు మంత్రి సమాధానం చెప్పడానికి సిద్ధపడినప్పుడు ప్రకటన చేస్తానని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి చెప్పారని, మంత్రి సమాధానం చెప్పిన తర్వాత ప్రకటన చేయాలని తాము కోరామని, అయినా వినకుండా సభను స్పీకర్ వాయిదా వేశారని తెలుగుదేశం సభ్యులు చెప్పారు.
చర్చ ప్రారంభమైనప్పుడు గానీ, ముగిసినప్పుడు గానీ ముఖ్యమంత్రి సభలో లేరని, దీన్ని బట్టే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బట్టబయలు అవుతోందని వారన్నారు. రేపు శాసనసభ సమావేశాల ముగింపు రోజని, రేపు ఎజెండా నిర్దిష్టంగా ఉందని వారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో సహా తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ధర్నాకు దిగారు. వరికి మద్దతు ధరపై జరిగిన చర్చకు రేపు సమాధానం ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications