దేవేందర్ ప్రకటనకు విలువ లేదు: యనమల
హైదరాబాద్: తెలంగాణపై మహానాడు లోపు నిర్ణయం ప్రకటిస్తామన్నది పార్లీ నిర్ణయం కాదని తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మహానాడుకు ఎజెండానే ఖరారు కాలేదని, అలాంటిది నిర్ణయం ఎలా ప్రకటిస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రానికి ముందు పార్టీలో విస్తృతమైన చర్చ జరగాలని, ఇది 8.75 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయమని ఆయన ఆదివారంనాడు ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. నిర్ణయానికి ముందు అన్ని ప్రాంతాలవారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రం నాలుగు ముక్కలవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంటే కాంగ్రెస్ - తెరాస కొన్ని చోట్ల ఎందుకు ఓడిపోయాయని ఆయన అడిగారు. సమైక్యాంధ్ర, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం చెప్పకుండా తాము ప్రతిస్పందించడం సరి కాదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారా ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రకటనకు పెద్దగా విలువ ఉండదని ఆయన అన్నారు. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ తన వ్యక్తిగతాభిప్రాయాన్ని చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications