మేడిన్ ఆంధ్రా బంగారం.. మార్కెట్ లో అందుబాటులో!
ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన శుభవార్త. ఏపీకి స్వర్ణగిరిగా చెప్పబడే జొన్నగిరి గోల్డ్ మైన్స్ బంగారం మార్కెట్ లోకి వచ్చేసింది. కర్నూలుజిల్లా తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి తీసిన బంగారాన్ని ప్రాసెస్ చేసి ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేశారు. జియో మైసూర్ సంస్థ ఈ బంగారాన్ని బిస్కెట్ ల రూపంలో తయారు చేసింది. 100గ్రాముల నుంచి 500గ్రాముల వరకు వివిధసైజుల్లో ఈ బంగారం బిస్కెట్లు లభ్యం అవుతున్నాయి.
జొన్నగిరి గోల్డ్ మైన్స్ మొదటి ఉత్పత్తి
ప్రతి బంగారం బిస్కెట్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటం స్పష్టంగా ముద్రించారు. అంతేకాకుండా 'జొన్నగిరి గోల్డ్ మైన్స్ మొదటి ఉత్పత్తి' అని కూడా గుర్తింపు ముద్ర వేశారు. ఇది స్థానికంగా తయారైన బంగారం అని గర్వంగా చెప్పుకోవడానికి ఇకపై బంగారం మేడిన్ ఆంధ్రా అని చెప్పుకోవటానికి ఏపీ వాసులు గర్వంగా ఫీల్ కావచ్చు .

మేడిన్ ఆంధ్రా బంగారం
కర్నూలు నగరంలోని షరాబ్ బజార్‌కు చెందిన కొందరు వ్యాపారులు ఈ బంగారం బిస్కెట్ లను కొనుగోలు చేశారు. వారు దీనిని 'మేడిన్ ఆంధ్రా బంగారం' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఆంధ్రప్రదేశ్ ఖనిజసంపదలో మరో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. రాష్ట్రంలో బంగారునిక్షేపాలు ఉన్నాయని చాలాకాలంగా చర్చ జరుగుతున్న వేళ జొన్నగిరిలో . ఇప్పుడు వాటిని వాణిజ్యపరంగా ఉపయోగించి మార్కెట్‌లోకి తీసుకురావడం రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు మంచి సంకేతం.
తొలి ఏడాది దాదాపు 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యం
ఈ బంగారం బిస్కెట్ లు స్థానిక మార్కెట్లలో లభ్యం కావడంతో బంగారం ప్రేమికులు, ఆభరణాల వ్యాపారులు ఆంధ్రా బంగారం అంటూ ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీలో ఉన్న మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గనుల ప్రాజెక్టు అయిన ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి ఏడాదిలో దాదాపు 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండవ సంవత్సరానికి ఇది 900 కిలోల లక్ష్యం కాగా, ఆ తర్వాత క్రమంగా ఏటా 2 టన్నుల వరకు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications