వైయస్ నిజస్వరూపం వెల్లడి: కాకా
హైదరాబాద్: తెలంగాణపై తాజా వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నిజస్వరూపం బయటపడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి (కాకా) వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు వైయస్, చంద్రబాబు, సీతారాం ఏచూరి, రాఘవులు అడ్డంకి అని ఆయన మరోసారి అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయని ఆయన అన్నారు.
తెలంగాణే ఎజెండాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. ఈ మేరకు తాను ఈ రోజే సోనియాకు లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తాను సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారని, ఆ మాటల్లో అర్థం ఉందని తాము భావించామని, అయితే తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సోనియాకు పరిమితులున్నాయని, ఆమె మోనార్క్ కాదని ఇప్పుడు వైయస్ వ్యాఖ్యానించారని, దీంతో తెలంగాణ ప్రజల ఆశలు అడుగంటాయని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఇక అందరూ రోడ్డెక్కాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications