వైయస్ లక్ష్మణ రేఖ దాటారు: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తమను మభ్యపెడుతూ వచ్చారని, తమ నమ్మకాన్ని ముఖ్యమంత్రి వమ్ము చేశారని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్ ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించే రీతిలో రాష్ట్ర నాయకత్వం పనిచేస్తోందని, ఇది దిగ్భ్రాంతికరమని ఆయన అన్నారు. సోనియా సుప్రీం అని ఇంతకాలం అన్న వైయస్ ఇప్పుడు మోనార్క్ కాదని అంటున్నారని, తమకైతే ఆమె సుప్రీం అని ఆయన అన్నారు. సోనియా చేతిలోనే నిర్ణయం ఉందని ఆయన చెప్పారు.
తెలంగాణ విషయంలో తాము లక్ష్మణ రేఖ దాటలేదని, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరెడ్డే దాటారని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి మాటలు సోనియా గాంధీని హెచ్చరించేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. సోనియా ధిక్కరించి పదవుల్లో ఉండలేరని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, తాను కూడా కట్టుబడి ఉంటానని, తాను కూడా తెలంగాణపై మాట్లాడబోనని, ఎవరూ మాట్లాడవద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ఆ మాటలను జవదాటారని ఆయన అన్నారు. స్వయం పరిపాలనను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండడానికి వీలు లేదని ఆయన అన్నారు. గతంలో రెండు సార్లు వైయస్ నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications