అభివృద్ధి ఎజెండాపై విపక్షాల మండిపాటు
హైదరాబాద్: కొంత మంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అభివృద్ధి మంత్రం జపిస్తూ ఢిల్లీకి వెళ్లిన వైనంపై స్వపక్షం నుంచి వ్యతిరేకత, విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికిప్పుడు అభివృద్ధి తెలంగాణ ఎజెండా ముందుకు రావడం పట్ల కాంగ్రెస్ శాసనసభ్యుడు గుర్నాధ్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఇది రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్రం ఇస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి అభివృద్ధి మంత్రాన్ని ఇప్పటి వరకు మంత్రులు జీవన్ రెడ్డి, మారెప్ప వల్లించారని, ఇప్పుడు వీరు వల్లిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. తమకు అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలంటున్నవారికి ప్రజల్లో ఉన్న పలుకుబడి ఎంతో, వారు ప్రజల్లో ఉంటారో, హైదరాబాదులో ఉంటారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అడుగులకు మడుగులొత్తే వాళ్లు ఆ మాటలంటున్నారని ఆయన అన్నారు. పలికేది వీరే అయినా పలికించేదెవరో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
తెలంగాణపై కాంగ్రెస్ నాటకం ఆడుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడే తెలంగాణ ఇవ్వాలని ఢిల్లీకి వెళ్లినవారికి వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలని మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లడం నాటకమని, ఇదంతా గందరగోళం సృష్టించడానికేనని ఆయన అన్నారు. తెలంగాణపై ఇతరులు మాట్లాడుతున్న విషయాలు మరుగున పరిచేందుకు ఈ నాటకం ఆడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications