ఢిల్లీ యాత్ర సక్సెస్: కాంగ్రెస్ సీనియర్లు
హైదరాబాద్: అనివార్య కారణాల వల్లనే తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలువలేకపోయామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సోనియాను కోరడానికి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ తిరిగి వచ్చారు. అపాయింట్ మెంట్ అనేది తమకు, సోనియాకు సంబంధించిన విషయమని వారన్నారు. తమ ఢిల్లీ యాత్ర విజయవంతమైందని వారు చెప్పుకున్నారు.
తాము ప్రణబ్ ముఖర్జీతో శనివారం గంటన్నరకు పైగా సమావేశమయ్యామని, అధిష్ఠానవర్గం తెలంగాణకు అనుకూలంగా ఉందని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ విషయంలో 75 శాతం తాము ముందుకు సాగామని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాదంటే రాజీనామా చేస్తాననే మాటకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యలపై శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలంగాణ నాయకులు చెప్పారు.












Click it and Unblock the Notifications
