ఈ నెల 25 తర్వాతే తెరాస రాజీనామాలు
హైదరాబాద్: ఈ నెల 25వ తేదీ తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధులు సామూహిక రాజీనామాలు చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాతనే రాజీనామాలు చేయాలని పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఒకేసారి రాజీనామాలు చేస్తారు. వచ్చే నెల 6వ తేదీన రాజీనామాలు చేయాలని తెరాస ముందు నిర్ణయించింది. అయితే అంతకన్నా ముందే రాజీనామాలు చేయాలని ఆదివారంనాటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఎప్పుడు ఎలా రాజీనామా చేయాలనే విషయంపై చంద్రశేఖరరావు సోమవారం పార్టీ శాసనసభ్యులతో విస్తృతంగా చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులతో, తెలంగాణ మేధావులతో చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించారని భావించిన తెరాస నాయకులు మార్చి 6వ తేదీకి ముందే రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియా గాంధీ సానుకూల నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేరని, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఒత్తిడికి కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తలొగ్గుతోందని తెరాస భావిస్తోంది. ఈ స్థితిలో ముందుగానే రాజీనామాలు చేసి ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications
