రాజీనామాల ఆలోచన: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామాలు చేసే ఆలోచన తమకు ఎప్పటి నుంచో ఉందని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చొరవ తీసుకుని తెలంగాణ ఏర్పాటుకు చొరవ చూపాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సెంటిమెంటుకు ఎవరైనా తలొగ్గక తప్పదని, అందుకే తామంతా ముందుకు వచ్చామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని రెండో సారి ఢిల్లీకి పిలిచి తమను పిలవకపోవడం బాధాకరంగానే ఉందని ఆయన అన్నారు. తమ అభిప్రాయాన్ని కూడా సోనియా గాంధీ వినాలని ఆయన అన్నారు.
తెలంగాణ ఇస్తే నక్సల్స్ ప్రాబల్యం పెరుగుతుందని హోం మంత్రి కె. జానారెడ్డి చేసిన ప్రకటన నిజమని, జానారెడ్డి నిజం చెప్పడం హర్షదాయకమని, మిగతా మంత్రులు కూడా ముందుకు రావాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రతిదానికీ తలూపుతూ పోతే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, తమకు నష్టమని ఆయన అన్నారు. స్వేచ్ఛ లేకుండా అణగిమణగి ఉండాలంటే సాధ్యం కాదని ఆయన అన్నారు. సీనియర్స్ చెప్పింది కూడా ముఖ్యమంత్రి వినాలని, ఒంటెత్తు పోకడ సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
