టిడిపిలో కడియం శ్రీహరి కలకలం
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిందేనని పార్టీ నాయకుడు కడియం శ్రీహరి గళమెత్తడంతో తెలుగుదేశం పార్టీలో మళ్లీ సంక్షోభం తలెత్తింది. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అత్యవసరంగా పార్టీ ప్రధాన కార్యదర్శులతో గురువారం సమావేశమయ్యారు. ఇటీవల టి. దేవేందర్ గౌడ్, చెన్నమనేని రాజేశ్వరరావు, తదితర తెలుగుదేశం నాయకులు తెలంగాణ అనుకూల వైఖరిని ప్రదర్శించడంతో పార్టీలో కలకలం పుట్టిన విషయం తెలిసిందే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు సర్దిచెప్పడంతో తాత్కాలికంగా ఆ తెలంగాణ వైఖరికి తెరపడింది. తాజాగా బుధవారంనాడు పార్టీ నాయకత్వంపై కడియం శ్రీహరి తిరుగుబాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న కడియం శ్రీహరి బుధవారంనాడు తెరాస ప్రజాప్రతినిధుల రాజీనామాలను ఆహ్వానిస్తూ అనుకూల ప్రకటన చేశారు. ఇది కూడా చంద్రబాబును కలవరపెట్టే విషయమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న లగడపాటి రాజగోపాల్ వంటి ఆంధ్ర కాంగ్రెస్ నాయకులను, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి తెలంగాణ మంత్రులను ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామనే చంద్రబాబు ప్రకటనపై ఆయన ప్రతిస్పందిస్తూ వ్యూహ్యాత్మక ఎత్తుగడలు సైతం సరైన సమయంలో తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీ సమైక్యవాద వైఖరిని తీసుకుంటే తాను దానికి కట్టుబడి ఉండలేనని స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఆయన ఈ మాట ద్వారా చంద్రబాబుకు పరోక్ష హెచ్చరిక చేశారు.












Click it and Unblock the Notifications