గిలగిలా కొట్టుకుంటున్న పాక్! రాత్రి 9 గంటలకే బంద్, పెళ్లి భోజనాలపై రూల్స్
పొరుగు దేశమైన పాకిస్థాన్ తీవ్ర ఇంధన కొరత, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ఇంధన వ్యయం పాక్ ఎకానమీని చావుదెబ్బ కొట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ పలు కీలక నిబంధనలతో స్మార్ట్ లాక్ డౌన్ ను అమల్లోకి తెచ్చింది.
ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న షాపింగ్ మాల్స్, మార్కెట్లను రాత్రి 9 గంటలకే మూసివేయాల్సి ఉంటుంది. అలాగే వివాహ వేడుకలు, ఫంక్షన్ హాళ్లను రాత్రి 10 గంటలకల్లా క్లోజ్ చేయాలని ఆదేశించింది. పెళ్లిళ్లకు వచ్చేవారికి విందులో కేవలం 'ఒకే ఒక్క వంటకం' మాత్రమే వడ్డించాలని స్పష్టమైన నిబంధన విధించింది. హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే పనిచేయడానికి అనుమతినిచ్చారు. అయితే హోమ్ డెలివరీలు, టేక్ అవే సేవలకు ఈ సమయ వేళల నుంచి మినహాయింపు ఇచ్చారు.

ప్రభుత్వ వాహనాల్లో కోత.. మంత్రుల విదేశీ ప్రయాణాలపై బ్యాన్!
కేవలం సామాన్య ప్రజలపైనే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంపై కూడా పాక్ సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. ప్రభుత్వ అధికారుల వాహనాలకు ఇచ్చే ఉచిత పెట్రోల్, డీజిల్ కోటాలో ఏకంగా 50 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడు నెలల పాటు విదేశీ పర్యటనలు, కొత్త వాహనాల కొనుగోలుపై సంపూర్ణ నిషేధం విధించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష సమావేశాలకు బదులుగా టెలికాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే సమీక్షలు నిర్వహించాలని, విదేశీ ప్రతినిధులు వస్తే తప్ప అధికారిక విందులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
పెట్రోల్ సెగ.. నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం!
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో పాకిస్థాన్‌లో రోజువారీ ఇంధన ధరలను సమీక్షిస్తున్నారు. డీజిల్ ధరలు లీటరుకు రూ. 424 దాటిపోవడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లకు కొంతవరకు ఊరట ఇచ్చేందుకు లీటరుపై రూ. 100 సబ్సిడీని ప్రకటించినప్పటికీ, పరిస్థితులు ఎంతవరకు సర్దుమణుగుతాయో చెప్పడం కష్టంగా మారింది. పాఠశాలల వేళల్లో మార్పులు, ఆఫీసుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో ఈ కఠిన ఆంక్షలు అమలు చేయక తప్పడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.














Click it and Unblock the Notifications
