పాతాళానికి పాకిస్థాన్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి.. మరీ ఇంత దారుణమా..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్దం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పేద, మధ్య తరగతి దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ చమురు, గ్యాస్ కష్టాలు నెలకున్నాయి. ఇక అసలే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారైంది. పాకిస్థాన్ లో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, భద్రతా సమస్యలు ఉన్నాయి. ద్రవ్యోల్బణంతోపాటు పేదరికం, నిరుద్యోగిత కూడా ఇప్పుడు పాకిస్థాన్ ను కుదిపేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ లో పేదరికం 28.9 శాతానికి చేరింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి గానూ గరిష్టంగా పాకిస్థాన్ లో 28.9 శాతానికి పేదరికం శాతం ఎగబాకడం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. అలాగే దేశంలో నిరుద్యోగిత కూడా బాగా పెరిగింది.
పాకిస్థాన్ లో నిరుద్యోగం ఇప్పుడు 12.69 శాతానికి ఎగబాకింది. నిరుద్యోగం, పేదరికాన్ని తగ్గించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నా అవి అక్కడున్న ప్రజానీకానికి ఏమాత్రం సరిపడేలా లేవు. ది ఫ్రైడే టైమ్స్ అందించిన రిపోర్టు ప్రకారం.. ది ఎకనామిక్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ 2025-26 నుంచి తీసుకున్న డేటా ఆధారంగా జాతీయ పేదరికం విలువ ఈ ఏడాది 28.9 శాతానికి చేరింది. గతేడాది ఇదే పేదరికం రేటు 21.9 శాతంగా ఉంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే దేశంలోని ప్రముఖ నగరాల్లో పేదరికం మరింత తీవ్రంగా ఉంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో పేదరికం రేటు 16.5 శాతం నుంచి 23.3 శాతానికి చేరింది. అలాగే సింధ్ రాష్ట్రంలో 24.5 శాతం నుంచి 32.6 శాతానికి పేదరికం విలువ చేరింది. దీంతో అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
అలాగే ఖైబర్ పంఖ్త్వుక్వా ప్రావిన్స్ లో పేదరికం శాతం 28.7 శాతం నుంచి 35.3 శాతానికి చేరింది. ఇక బలూచిస్థాన్ లో పేదరికం శాతం చూస్తే బెంబేలెత్తాల్సిందే. అక్కడ గతేడాది 41.8 శాతం ఉన్న పేదరికం ఇప్పుడు 47 శాతానికి పెరిగింది. అంటే ప్రతి 10 మందిలో దాదాపు ఐదుగురు అక్కడ పేదరికంలోనే మగ్గుతున్నారని స్పష్టం అవుతోంది. ఇక నిరుద్యోగం వివరాలకు వస్తే గతేడాది నిరుద్యోగంతో 4.5 మిలియన్ మంది యువత ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 5.9 మిలియన్ కు చేరడం ఆందోళన కలిగిస్తోంది.

అలాగే నిరుద్యోగిత రేటు గతేడాది 6.3 శాతం ఉండగా ఇప్పుడు అది 12.69 శాతానికి చేరింది. అంటే ఒక్క సంవత్సరంలోనే నిరుద్యోగిత రేటు ఏకంగా 7.1 శాతం పెరగడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రిపోర్టు ప్రకారం.. ఉద్యోగాల కల్పన, ఎడ్యూకేషన్ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ లో పెట్టుబడులు, వైద్యరంగాన్ని పటిష్టం చేయడం, ఆర్థిక ప్రగతిని సాధించడం ద్వారానే పరిస్థితులు మెరుగుపడతాయని స్పష్టం చేసింది. పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం కాకుండా ఇలాంటి నిబంధనలను పాటించాలని తెలిపింది.












Click it and Unblock the Notifications
