వారానికి 4 రోజులే ఆఫీసులు.. స్మార్ట్ లాక్‌డౌన్' దిశగా పాక్!
ఇప్పటికే ఆర్థిక సవాళ్లతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను చమురు సంక్షోభం మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ప్రపంచ విపణిలో ముడిచమురు సరఫరాకు ఏర్పడుతున్న విఘాతాల వల్ల దేశంలో ఇంధన నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి, ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో 'స్మార్ట్ లాక్‌డౌన్' విధించి, వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఆఫీసులు నడిపించే దిశగా అడుగులు వేస్తోంది.
పెట్రోల్ రూ. 384.. డీజిల్ రూ. 415!
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల పాకిస్థాన్‌లో ఇంధన ధరలు రెక్కలు విప్పాయి. ఇటీవల ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 4.10, హైస్పీడ్ డీజిల్ ధరను రూ. 6.41 మేర పెంచింది. దీంతో పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 384.34కు చేరగా, డీజిల్ ధర రూ. 415.83కు పెరిగి రికార్డు సృష్టించింది. ఇంధన భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

వారానికి 4 రోజులే పని.. త్వరగా మూతపడనున్న మార్కెట్లు
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చమురు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు పాక్ సర్కార్ పలు కఠిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. వారానికి నాలుగు రోజుల పనిదినాలను అమలు చేయడం, ఉద్యోగులను రొటేషన్ పద్ధతిలో ఆఫీసులకు రప్పించడం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అంశాలను పరిశీలిస్తున్నారు. వీటికి తోడు ఇంధనంతో పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి షాపింగ్ మాళ్లు, వాణిజ్య సముదాయాలు, మార్కెట్లను సాయంత్రమే ముందస్తుగా మూసివేసేలా నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు.
ప్రభుత్వ వాహనాలకు బ్రేక్.. ఉచిత పెట్రోల్‌కు కోత
కేవలం ప్రజలపైనే కాకుండా, ప్రభుత్వ శాఖలపై కూడా ఆంక్షలు విధించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అనవసర అధికారిక ప్రయాణాలను రద్దు చేయడంతో పాటు, ప్రభుత్వ వాహనాలకు ఇచ్చే ఇంధన కోటాను గణనీయంగా తగ్గించాలని చూస్తున్నారు. అయితే ఈ 'స్మార్ట్ లాక్‌డౌన్' ప్రచారంపై పాక్ ప్రభుత్వ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదా చర్యలు తప్పవని సమాచార శాఖ మంత్రి స్పష్టం చేస్తుంటే, లాక్‌డౌన్ దిశగా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మరికొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.
సబ్సిడీ ఇంధనం.. రోజువారీ మార్పుల్లో ధరలు
విపరీతంగా పెరిగిన ధరల నుంచి సామాన్యులకు ఊరటనిచ్చేందుకు 'పీఎం ఫ్యూయల్ రిలీఫ్ స్కీమ్' ద్వారా సబ్సిడీ పెట్రోల్‌ను అందిస్తున్నారు. ఈ పథకం కింద బైక్ యజమానులకు వారానికి 5 లీటర్లు, కార్ల యజమానులకు 10 రోజులకు 10 లీటర్ల చొప్పున సబ్సిడీ ధరకే ఇంధనాన్ని కేటాయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన తీవ్ర అస్థిరత కారణంగా, గతంలో ఉన్న వారపు ధరల సమీక్షా విధానాన్ని స్వస్తి చెప్పి, పాకిస్థాన్ ఇప్పుడు రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే నయా విధానాన్ని అమలులోకి తెచ్చింది.













Click it and Unblock the Notifications
