యూపీ ఓటరు లిస్ట్ లో ఆ 16.18 లక్షల మంది ఎవరు ? రేపు ఫలితాన్ని మార్చేది వీరేనా?
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, బీజేపీకి అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (UP SIR)లో ఓ భారీ సంచలనం నమోదైంది. రాష్ట్రంలో ఈసీ నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఏకంగా 16.18 లక్షల కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారు. అయితే వారి వివరాలు మాత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) వెబ్ సైట్లో మాత్రం కనిపించడం లేదు. దీంతో ఈ ఓటర్లను రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని చేర్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐఆర్ ప్రారంభ దశల్లో ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితాలో కొత్తగా 16.18 లక్షల మంది ఓటర్లను చేర్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నప్పటికీ, వారి పేర్ల నమోదుకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని ది రిపోర్టర్స్ కలెక్టివ్ తన కథనంలో పేర్కొంది. ఎన్నికల చట్టాలు, నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, మార్పులకు సంబంధించిన క్లెయిమ్స్, అభ్యంతరాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా, రాష్ట్ర సీఈఓ వెబ్‌సైట్‌లో పోలింగ్ బూత్ స్థాయి వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల వివరాలతో పాటు ఫోటో లేకుండా వ్యక్తిగత దరఖాస్తు ఫారమ్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉండాలని ఈ కథనం పేర్కొంది. అయితే, యూపీలో చేర్చినట్లు చెబుతున్న 16.18 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు సీఈఓ వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు.

SIR ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్ తుది ఓటర్ల జాబితాలో 84.3 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది. అయితే, వీరిలో ఒక వర్గానికి సంబంధించిన దరఖాస్తుల వివరాలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రశ్నలకు దారితీస్తోందని కథనం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత కోసం క్లెయిమ్స్, అభ్యంతరాల వివరాలను ప్రజలు పరిశీలించే అవకాశం కల్పించడం ముఖ్యమైన అంశం. కొత్తగా ఓటర్లుగా నమోదైన వ్యక్తుల దరఖాస్తులను పరిశీలించేందుకు అవసరమైన సమాచారం అందుబాటులో లేకపోవడం ఇక్కడ వివాదాస్పదమవుతోంది. ఈ అంశంపై ది రిపోర్టర్స్ కలెక్టివ్ ఈసీ, ఉత్తరప్రదేశ్ సీఈఓకు ప్రశ్నలు పంపినా స్పందన రాలేదని చెబుతోంది. దీంతో ఈ 16.18 లక్షల మంది ఓటర్ల దరఖాస్తుల వివరాలు వెబ్‌సైట్‌లో ఎందుకు కనిపించడం లేదు, వాటిని ప్రజల పరిశీలనకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.














Click it and Unblock the Notifications
