వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి మరో కీలక అడుగు!
చారిత్రక ఓరుగల్లు నగర ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టు పనులలో వేగం పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కారణంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసి, డీపీఆర్ సిద్ధం చేయగా, నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది.
ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఎయిర్‌పోర్టు పునరుద్ధరణలో భాగంగా రూ.213.59 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రధాన నిర్మాణ పనుల నిమిత్తం తాజాగా అధికారిక టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్ గడ్డపై మళ్లీ విమాన సర్వీసులు నడిపించేందుకు మార్గం సుగమమైంది.

విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో పలు కీలక భవనాలను నిర్మించనున్నారు. ఇందులో ప్రధానంగా ప్రయాణికుల రాకపోకల కోసం విశాలమైన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్, విమానాల రాకపోకలను పర్యవేక్షించేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం జరగనుంది.
అలాగే విద్యుత్ సరఫరా నిమిత్తం ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, అత్యవసర సేవల కోసం ఫైర్‌స్టేషన్, మరియు మెయింటెనెన్స్ పనుల కొరకు ఈఅండ్‌ఎం వర్క్‌షాప్ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ కచ్చితంగా 18 నెలల కాలపరిమితిలోగా పూర్తి చేయాల్సి ఉంటుందని నిబంధనల్లో స్పష్టం చేశారు.ఈ టెండర్ ప్రక్రియకు సంబంధించి కీలక తేదీలను ఏఏఐ ఖరారు చేసింది.
ఈ నెల 28వ తేదీన కాంట్రాక్టర్లు మరియు బిడ్డర్ల కోసం ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఆసక్తి గల సంస్థలు నవంబరు 3వ తేదీ వరకు తమ బిడ్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. నవంబరు 9వ తేదీన టెక్నికల్ బిడ్లను, నవంబరు 30వ తేదీన ఫైనాన్షియల్ బిడ్లను అధికారులు పరిశీలించి తెరవనున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమై పూర్తయితే, వరంగల్ ప్రాంతం పారిశ్రామిక, పర్యాటక మరియు రవాణా రంగాల్లో అపూర్వమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
