చివరి వరకు సస్పెన్స్.. రియలిస్టిక్ టచ్‌తో మెప్పించే స్పై థ్రిల్లర్!
ఈ ఏడాది కేవలం మూడు సినిమాలు మాత్రమే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిశీలనకు వెళ్లాయి. వాటిలో 'ధురంధర్', సల్మాన్‌ఖాన్ 'మాతృభూమి'తో పాటు 'సీక్రెట్ సోల్జర్' కూడా ఉంది. సినిమా పలు దశల్లో పరిశీలనకు వెళ్లి, చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో అసలు ఈ సినిమాలో అంతగా చర్చకు వచ్చిన కంటెంట్ ఏమిటన్న ఆసక్తి ఏర్పడింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా? రివ్యూలో చూద్దాం.
కథేంటి?
నెల్లూరుకు చెందిన వలి (నిహాల్ కోదాటి), పృథ్వి (సూర్య శ్రీనివాస్) ఇద్దరు స్నేహితులు. వలికి దేశం కోసం పని చేయాలనే తపన ఉంటుంది. ఆర్మీ కి ప్రయత్నిస్తాడు. అందులో విఫలం కావడంతో 'రా' కోసం పని చేయాలని అనుకుంటాడు. అనుకోకుండా ఒక కేసులో జైలుకి వెళ్ళడంతో తనపై ఉద్రవాది ముద్ర పడుతుంది. ఇదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన ఓ కీలకమైన సమాచారం లీక్ అవుతుంది. ఈ లీక్ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మిషన్ లోకి వలి, పృథ్వి ఎలా వచ్చారానేది మిగతా కథ.

విశ్లేషణ:
'సీక్రెట్ సోల్జర్'లో దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా స్పై సినిమాల్లో కనిపించే భారీ యాక్షన్, గ్లామర్, ఫారిన్ లొకేషన్స్ కంటే.. ఒక డిఫెన్స్ లీక్, దాని వెనుక ఉన్న కుట్ర, దానిలో చిక్కుకున్న ఇద్దరు స్నేహితుల కథను ప్రధానంగా తీసుకోవడం ఆసక్తికరంగా ఉంది. కథలో స్నేహం, దేశభక్తి, జాతీయ భద్రత అంశాలను కలిపిన విధానం సినిమాకు ప్రత్యేకత తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ ట్రాక్‌ను కేవలం కామెడీ లేదా ఎమోషన్ కోసం కాకుండా కథలో భాగంగా ఉపయోగించడం బాగుంది.
దర్శకుడు రియలిస్టిక్ ట్రీట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. తెరపై జరిగే కొన్ని సంఘటనలు నిజంగానే జరుగుతున్నాయేమో అన్న ఫీలింగ్ కలిగించేలా సన్నివేశాలను డిజైన్ చేశారు. ఇదే సినిమాకు ప్రధాన బలం. సీక్రెట్ సోల్జర్ మిషన్‌కు సంబంధించిన అంశాలు, కథలో వచ్చే మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ ఎటు వెళ్తుందన్న క్యూరియాసిటీ కొన్ని చోట్ల బాగా పనిచేస్తుంది. కాకపోతే కథలోని కొన్ని అంశాలను మరింత స్పష్టంగా వివరించి ఉంటే ఇంపాక్ట్ పెరిగేది. ముఖ్యంగా డిఫెన్స్ లీక్, కుట్రకు సంబంధించిన నేపథ్యాన్ని ఇంకా స్పష్టంగా ప్రజెంట్ చేసి వుంటే బావుండేది.
నటీనటుల పనితీరు:
వలి పాత్రలో నిహాల్ కోదాటి సహజమైన నటనతో ఆకట్టుకుంటాడు. యాక్షన్, ఎమోషన్ సన్నివేశాల్లో తన పాత్రకు తగ్గట్టుగా కనిపించాడు. ముఖ్యంగా కథతో పాటు తన పాత్రలో మార్పు కనిపించే సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. సూర్య శ్రీనివాస్ కూడా పృథ్వి పాత్రలో మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ సినిమాకు ఉపయోగపడింది. కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తమకు ఇచ్చిన కీలక పాత్రల్లో మెప్పించారు. కథకు అవసరమైన బరువును తీసుకురావడంలో వీరి అనుభవం ఉపయోగపడింది.
టెక్నికల్‌గా... దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి సినిమాను రియలిస్టిక్ టోన్‌లో నడిపించడానికి ప్రయత్నించారు. భారీ స్పై సినిమా తరహా హంగుల కంటే కథ, పాత్రలు, పరిస్థితులపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు ఉన్న రియలిస్టిక్ మూడ్‌ను బలపరుస్తుంది. లొకేషన్స్‌ను సహజంగా చూపించడం, యాక్షన్ సన్నివేశాలను అతిగా స్టైలైజ్ చేయకుండా తెరకెక్కించడం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ సన్నివేశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కథలో టెన్షన్ పెంచాల్సిన చోట మ్యూజిక్ సహకరిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరింత షార్ప్‌గా ఉండే అవకాశం ఉంది. కొన్ని సన్నివేశాలను కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ పేసింగ్ ఇంకా మెరుగ్గా ఉండేది. .
చివరగా...'సీక్రెట్ సోల్జర్' పూర్తిస్థాయి కమర్షియల్ స్పై ఎంటర్‌టైనర్ కంటే రియలిస్టిక్ టచ్‌తో తెరకెక్కిన స్పై థ్రిల్లర్. కొత్త కాన్సెప్ట్, ఫ్రెండ్షిప్ ట్రాక్, దేశభక్తి అంశాలు, కొన్ని థ్రిల్లింగ్ మలుపులు సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. స్పై థ్రిల్లర్స్, దేశభక్తి నేపథ్య కథలు ఇష్టపడే ప్రేక్షకులకు 'సీక్రెట్ సోల్జర్' మంచి ఛాయిస్.
రేటింగ్: 3/5.













Click it and Unblock the Notifications
