ఉప్పునూతలకు దామోదర్ సవాల్
హైదరాబాద్: తెలంగాణవాదం వినిపిస్తున్న తమ పార్టీ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సెంటిమెంటు ఉందని వాదిస్తున్న పురుషోత్తమ రెడ్డి అందుకు సిద్ధపడాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పదవుల కోసమే తెలంగాణ సీనియర్లు తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ నెల 24వ తేదీన భువనగిరిలో బహిరంగ సభ పెట్టినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
భువనగిరి సభను రద్దు చేసుకోవాలని ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వారు ఆ సభను రద్దు చేసుకుంటే మంచిదని, లేకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. సభను రద్దు చేసుకోకపోతే పార్టీ అధిష్ఠానవర్గానికి వారిపై ఫిర్యాదు చేస్తామని, అధిష్ఠానవర్గం వారిపై చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
