తెరాస సీట్లకు ఇంచార్జీ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల ఖాళీ అయిన లోకసభ, శాసనసభా నియోజక వర్గాలకు, తెర్లాం, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రులను ఇంచార్జీలుగా నియమించారు. ఈ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను ఆయన మంత్రులపై పెట్టారు. దీన్ని బట్టి ఉప ఎన్నికలు ఖాయమనే విషయం తేలిపోయింది. కరీంనగర్, ఆదిలాబాద్ లోక సభ స్థానాలకు ఉన్నత విద్యామంత్రి డి. శ్రీనివాస్ ను, వరంగల్, హన్మకొండ లోకసభ స్థానాలకు హోంమంత్రి కె. జానారెడ్డిని ముఖ్యమంత్రి ఇంచార్జీలుగా నియమించారు.
తెర్లాంకు గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణను, హైదరాబాదులోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీని ఇంచార్జీలుగా నియమించారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్టు దివంగత శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. శాసనసభా నియోజకవర్గాల్లో జడ్చర్లకు జి. చిన్నారెడ్డిని, ఆలేరుకు ఆర్ దామోదర్ రెడ్డిని, ఎల్లారెడ్డికి షబ్బీర్ అలీని, సిద్ధిపేటకు దామోదరం రాజనర్సింహను, ఖానాపూర్ కు జి. వినోద్ ను, మేడారంకు శ్రీధర్ ను, స్టేషన్ ఘనపూర్ కు రెడ్యానాయక్ ను, వికారాబాద్ కు సబితా ఇంద్రారెడ్డిని, రామాయంపేటకు ఫరీదుద్దీన్ ను, కమాలాపూర్ కు రత్నాకరరావును, హుజూరాబాద్ కు టి. జీవన్ రెడ్డిని, చేర్యాలకు పొన్నాల లక్ష్మయ్యను, దొమ్మాటకు జె. గీతారెడ్డిని, ముషీరాబాద్ కు ఎం. ముఖేష్ ను, డిచ్ పల్లికి వనమా వెంకటేశ్వరరావును, సికింద్రాబాద్ కు సంభాని చంద్రశేఖర్ ను ఇంచార్జీలుగా నియమించారు.
ఈ నెల 16వ తేదీన 16 నియోజకవర్గాల స్థాయి సమావేశాన్ని, 18వ తేదీన విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఏప్రిల్ లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications
