మందకృష్ణ దీక్ష: తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్: వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నాయకుడు మందకృష్ణ మాదిగ ఆమరణ నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాట తప్పారని విమర్శిస్తూ ఆయన హైదరాబాదులోని ఆబిడ్స్ లో గల ఒక భవంతి మూడో అంతస్థులో దీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే భవనంపై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటామని వికలాంగులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మందకృష్ణ మాదిగ దీక్షకు మద్దతుగా 9 హాస్టళ్లలోని వికలాంగ విద్యార్థులు దీక్షలకు దిగారు. లోపలి నుంచి గడయ వేసుకుని విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. హైదరాబాదులోని చాదర్ ఘాట్ ఎల్లమ్మతోట వద్ద వికలాంగులు దీక్షలకు దిగారు. దీక్ష చేస్తున్న మందకృష్ణ మాదిగను తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి పరామర్శించి, తన మద్దతు తెలియజేశారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. వికలాంగుల డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష కొనసాగుతుందని, ఇందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని మందకృష్ణ మాదిగ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మందకృష్ణతో రాయబారం నెరపడానికి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications