మందకృష్ణతో రాయబారం విఫలం
హైదరాబాద్: వికలాంగుల డిమాండ్లను తీర్చాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఎమ్మార్పీయస్ నాయకుడు మందకృష్ణ మాదిగతో ప్రభుత్వం నెరిపిన రాయబారం విఫలమైంది. ఆయన మంగళవారం సాయంత్రం నుంచి దీక్ష చేస్తున్నారు. వికలాంగుల పెన్షన్ ను నెలకు 1500 రూపాయలకు పెంచుతామని ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన వికలాంగుల సంక్షేమ శాఖ కమీషనర్ ను ఆయన డిమాండ్ చేశారు. అయితే కొంత మొత్తం మాత్రమే పెంచడానికి మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. తమ 34 డిమాండ్లకు పరిష్కారం చూపితే దీక్ష విరమిస్తానని మందకృష్ణ మాదిగ పట్టు పట్టి కూర్చున్నారు.
ఇదిలా ఉంటే, మందకృష్ణ మాదిగ శిబిరంలోని నలుగురు వికలాంగులు అస్వస్థకు గురయ్యారు. మందకృష్ణ మాదిగ తీరును అంతకు ముందు మంత్రి ఎన్. రాజ్యలక్ష్మి తప్పు పట్టారు. మందకృష్ణ మాదిగ బెదిరింపు ధోరణిని అవలంబిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అన్నీ అంగీకరించి ఇప్పుడిదేమిటని ఆమె అడిగారు. అయితే తాము అంగీకరించలేదని, చర్చలు విఫలమయ్యాయని తాను చెప్పానని మందకృష్ణ మాదిగ అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పిందని ఆయన విమర్శించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications