భూపంపిణీపై వామపక్షాల వాకౌట్
హైదరాబాద్: భూపంపిణీలో అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తూ సిపిఐ, సిపియం, బిజెపి మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం శాసనసభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు వివిధ వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. పెరిగిన స్టీలు, సిమెంటు ధరల వల్ల ఇళ్ల నిర్మాణ వ్యయం పెరగడంపై తెలుగుదేశం, సిపిఐ, విజయనగర అటవీ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించే విషయంపై సిపియం, చేనేత కార్మికుల సమస్యలపై బిజెపి వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు.
ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీపై వామపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. తమ పోరాటాల వల్లనే ప్రభుత్వం భూ సమస్య తీవ్రతను గుర్తించిందని, అయితే ప్రభుత్వం చేపట్టిన భూపంపిణీ అవకతవకలతో కూడుకుందని వామపక్షాలు అన్నాయి. భూపంపిణీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి తన నియోజకవర్గంలోని అవకతవకలను తమ దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications