పోటీపైనే దేవేందర్ ఇంట్లో చర్చ: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్థుల పోటీ గురించే తాము తమ పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ఇంట్లో చర్చించామని తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. దేవేందర్ గౌడ్ నివాసంలో మంగళవారం రాత్రి పొద్దపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణకు అనుకూలంగా ఉప ఎన్నికలలోగా నాయకత్వం నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేవాలని ఆ సమావేశంలో తెలంగాణ నాయకులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో దేవేందర్ గౌడ్ నివాసంలో జరిగిన సమావేశంపై దయాకర్ రావు బుధవారంనాడు మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం ఉప ఎన్నికలకు ముందు చర్చకు రాకపోవచ్చునని ఆయన అన్నారు. ఎవరమైనా చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తన నివాసంలో జరిగిన సమావేశానికి అంత ప్రాధాన్యం లేదని టి. దేవేందర్ గౌడ్ కూడా చెప్పారు. తాము ఉప ఎన్నికల్లో పోటీ గురించే మాట్లాడుకున్నామని, ఎప్పుడైనా అంతర్గతంగా చర్చించుకుంటూనే ఉంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications