వీసాల స్కామ్: హైదరాబాదుకు వెంకటరెడ్డి
హైదరాబాద్: నకిలీ వీసాల కేసులో సినీ నటి ఆశాషైనీ మేనేజరుగా భావిస్తున్న వెంకటరెడ్డిని పోలీసులు బుధవారంనాడు హైదరాబాద్ కు తరలించారు. కేసు దర్యాప్తు కోసం అతన్ని చెన్నై నుంచి చార్మినార్ ఎక్సుప్రెస్సులో హైదరాబాద్ తీసుకొచ్చారు. అతన్ని గోషామహల్ లోని ఎసిపి కార్యాలయంలో ఉంచారు. వెంకటరెడ్డితో పాటు చెన్నైకి చెందిన ఐదుగురు అధికారుల బృందం హైదరాబాదుకు చేరుకుంది.
హైదరాబాదుకు చెందిన శ్రీలతను ఆశాషైనీ మేకప్ ఉమెనుగా చూపించి అమెరికాకు తీసికెళ్లడానికి చేసిన ప్రయత్నంలో నకిలీ వీసాల కుంభకోణం వెలుగు చూసింది. ఆశాషైనీని, శ్రీలతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటరెడ్డిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆశాషైనీకి, శ్రీలతకు బెయిలు లభించింది. వెంకటరెడ్డికి మాత్రం బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. నకిలీ వీసాలను ఇప్పించడంలో శ్రీనివాసన్ అనే వ్యక్తి ఏజెంటుగా పనిచేసినట్లు తెలుస్తోంది.
నకిలీ వీసాల కుంభకోణంలో తాను అమాయకుడినని, తనకేమీ తెలియదని నిందితుడు వెంకటరెడ్డి చెప్పాడు. ట్రావెల్ ఏజెంట్ శ్రీనివాస్ ఆచూకీ కోసం పోలీసులు వెంకటరెడ్డిని వెంట పెట్టుకుని హైదరాబాదులోని యూసుఫ్ గుడా ప్రాంతంలో తిరిగారు. తనకు ఈ కేసులో అనవసరంగా ఇరికించారని అతను మీడియా ప్రతినిధులతో అన్నాడు. శ్రీలత ద్వారానే తనకు ఆశాషైనీ పరిచయమైందని, శ్రీలత తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని అతను చెప్పాడు. తాను అమెరికా కాన్సులేట్ కార్యాలయంలోకి కూడా వెళ్లలేదని, తాను బయటే కూర్చున్నానని వెంకటరెడ్డి చెప్పాడు. తాను సరైన ధ్రువపత్రాలే ఇచ్చానని, తాను పలుమార్లు అమెరికాకు వెళ్లి వచ్చానని అతను చెప్పాడు. తాను చాలా చిన్నవాడినని, ఇంత ప్రచారం తనకు అక్కర్లేదని అతను అన్నాడు.












Click it and Unblock the Notifications