భువనగిరి సభ: అహ్మద్ పటేల్ పిలుపు
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులను దారిలోకి తేవడానికి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్వయంగా రంగంలోకి దిగారు. రెండు, మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో అహ్మద్ పటేల్ స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. అహ్మద్ పటేల్ బుధవారం పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామికి ఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించారు. సోనియాతో చర్చించడానికి రావాల్సిందిగా ఆయన కాకాకు చెప్పినట్లు సమాచారం.
మిగతా నాయకులతో చర్చించిన తర్వాతనే తాను ఢిల్లీకి వచ్చే విషయంపై చెప్పగలనని వెంకటస్వామి అహ్మద్ పటేల్ తో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుధవారం రెండో సారి వెంకటస్వామి ఇంట్లో సమావేశమయ్యారు. వీరప్ప మొయిలీ గత రెండు రోజులుగా సీనియర్ నాయకులకు విడివిడిగా ఫోన్ చేసి భువనగిరి సభను రద్దు చేసుకోవాలని కోరుతూ వచ్చారు. కానీ సీనియర్లు అందుకు నిరాకరించారు. తాను సీనియర్లతో మాట్లాడేది లేదని, వారిని ఢిల్లీకి పిలిచేది లేదని వీరప్ప మొయిలీ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పిన పది నిమిషాల లోపే అహ్మద్ పటేల్ వెంకటస్వామికి ఫోన్ చేశారు. సీనియర్లను పిలిచేది లేదని వీరప్ప మొయిలీ చెప్పగా వారికి కబురు పెట్టామని అహ్మద్ పటేల్ చెప్పారు.
భువనగిరి సభ విషయంలో సీనియర్లలో కూడా భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. పార్లమెంటు సభ్యులు సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ గౌడ్ అధిష్టానవర్గంతో ఘర్షణపడేలా సభ నిర్వహించడం సరి కాదని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటివారు సభా నిర్వహణకే మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలో సభను రద్దు చేసుకుంటే ప్రజల్లో ప్రతిష్ట దిగజారుతుందని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. సీనియర్లకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని, భువనగిరి సభ జరగకపోవచ్చునని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు హైదరాబాదులో చెప్పారు.












Click it and Unblock the Notifications