గుత్తా మళ్లీ తెలంగాణ గళం
హైదరాబాద్: తెలుగుదేశం నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి తెలంగాణవాదన వినిపించారు. తెలంగాణపై పార్టీ నాయకత్వం వచ్చే ఉప ఎన్నికల లోపల తేల్చాల్సిందేనని ఆయన బుధవారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఉప ఎన్నికల వల్ల తెలంగాణపై తెలుగుదేశం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ నిర్ణయం తీసుకోకపోతే కరీంనగర్ లోకసభ ఉప ఎన్నిక ఫలితమే వచ్చే ఉప ఎన్నికల్లో పునరావృతమవుతుందని ఆయన అన్నారు.
తమ పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ నివాసంలో జరిగిన సమావేశంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై, ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని ఆయన చెప్పారు. తన నివాసంలో జరిగిన సమావేశంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై చర్చించామని, దానికి అంత రాజకీయ ప్రాధాన్యం లేదని టి. దేవేందర్ గౌడ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇటువంటి సమావేశాలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ పోటీపై చర్చించినట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా సుఖేందర్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన వెనక్కి తగ్గారు.












Click it and Unblock the Notifications