అన్నీ వైయస్ ప్రాంతానికేనా?: విపక్షాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్వస్థలం ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి ప్రధాన కార్యాలయం పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ఇడుపులపాయలో రాజీవ్ గాంధీ టెక్నాలజీ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. ట్రిపుల్ ఐటి ప్రధాన కార్యాలయాన్ని ఇడుపులపాయలో పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగుదేశం శాసనసభ్యుడు టి. దేవేందర్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. సంస్థలన్నింటినీ ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందులలో పెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. పులివెందుల తప్ప మరో ప్రాంతం సంస్థల స్థాపనకు కనిపించదా అని ఆయన అన్నారు. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు.
బాసరలో ఐఐటి స్థాపనకు ముఖ్యమంత్రి చెప్పిన అభ్యంతరాలు ఇడుపుల పాయలకు వర్తించవా అని ఆయన అడిగారు. విమాన సౌకర్యం వంటి అనేక సౌకర్యాలు ఇడుపులపాయలకు ఉండవని ఆయన అన్నారు. నూజివీడు, బాసరల్లోని ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఇడుపులపాయలకు వెళ్లడానికి ఇబ్బంది పడతారని, అందువల్ల ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాదులో నెలకొల్పాలని బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ ప్రధాన కార్యాలయాన్ని బాసరలో పెట్టాలని సిపియం సభ్యుడు నోముల నర్సింహయ్య విజ్ఞప్తి చేశారు. ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన 330 ఎకరాల ప్రభుత్వ భూమి ఇడుపులపాయలో అందుబాటులో ఉందని ఐటి మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి చెప్పారు. నూజివీడులో ట్రిపుల్ ఐటి కోసం 100 ఎకరాల భూమిని, బాసరలో ట్రిపుల్ ఐటి కోసం 140 ఎకరాల భూమిని సేకరించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications