తెలంగాణ సాధనకే ఢిల్లీ: కాకా
హైదరాబాద్: తెలంగాణ సాధన కోసమే తాము ఢిల్లీ వెళ్తున్నామని కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చల కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన భువనగిరిలో సభ జరుగుతుందని ఆయన చెప్పారు. తొమ్మిది మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు. వారు గురువారం సాయంత్రం సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది.
సభలకు కూడా పార్టీ అధిష్ఠానవర్గం అనుమతి కావాలంటే ఎలా అని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తాము పార్టీలో బాధ్యతాయుతమైన వ్యక్తులమని ఆయన అన్నారు. తెలంగాణపై అధిష్ఠానవర్గం సీరియస్ గా ఉందని, అందుకే తమకు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇచ్చారని మరో సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ ఇస్తే చాలునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications