తెలంగాణపై రేపు కోర్ కమిటీ చర్చ: సోనియా
న్యూఢిల్లీ: తెలంగాణపై చర్చించేందుకు రేపు (శుక్రవారం) కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తానని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ తెలంగాణ సీనియర్లకు హామీ ఇచ్చారు. పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి నేతృత్వంలోని పదిమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తొలుత వారితో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఎఐసిసి నాయకుడు ఆంటోనీ చర్చలు ప్రారంభించారు. అనంతరం సోనియా గాంధీ చర్చల్లో పాల్గొన్నారు. గంటకుపైగా ఆమె కాంగ్రెస్ సీనియర్లతో సమావేశమయ్యారు.
తెలంగాణపై తమ అభిప్రాయాలను సోనియా విన్నారని, సోనియా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని ప్రతినిధి బృందంలోని కె.ఆర్. అమోస్ చెప్పారు. కోర్ కమిటీలో కాంగ్రెస్ సీనియర్లు లేవనెత్తిన అంశాలపై చర్చిస్తామని సోనియా హామీ ఇచ్చారు. తెలంగాణ సెంటిమెంటును చాటేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఈ నెల 24వ తేదీన భువనగిరిలో బహిరంగ సభ తలపెట్టారు. సభను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఎన్నిమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ కాంగ్రెస్ సీనియర్లు తమ పట్టు వీడలేదు. సభ నిర్వహించి తీరుతామని చెప్పారు. దీంతో వారితో చర్చించేందుకు సోనియా వారిని ఢిల్లీకి ఆహ్వానించారు. ఆ మేరకు సీనియర్లు గురువారం సాయంత్రం సోనియాతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications