శోభన్ మృతికి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి
హైదరాబాద్: సినీ హీరో శోభన్ బాబు హఠాన్మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తమ ఆప్తుడ్ని కోల్పోయిన విషాదాన్ని వ్యక్తం చేసింది. తన సోదరుడిని కోల్పోయినట్లుందని ప్రముఖ సినీ నటుడు కృష్ణ అన్నారు. సినిమాల్లోకి రాకముందు నుంచి తమకు పరిచయం ఉందని, ఇద్దరం నాటకాల్లో కలిసి నటించామని ఆయన చెప్పారు. తామిద్దరం సోదరుల్లాగా ఉండేవాళ్లమని, తన తల్లి కూడా శోభన్ ను సొంత కొడుకులాగా చూసుకునేదని, శోభన్ బాబు కూడా అలాగే ఉండేవారని ఆయన అన్నారు. శోభన్ బాబు చాలా విజయవంతమైన సినిమాల్లో నటించారని, తెలుగు సినీరంగంలోని నలుగురు అగ్ర నటుల్లో శోభన్ ఒక్కడిగా గుర్తింపు పొందారని ఆయన అన్నారు.
శోభన్ బాబు హీరోగానే ప్రజలకు దూరంగా ఉన్నారని ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. నిలకడగా వ్యవహరించేవారని, డబ్బులు కూడబెట్టే మనిషి కాదని, భూమిని నమ్ముకున్నారని, అంత తృప్తిని మరో సినీ నటుడిలో తాను చూడలేదని ఆయన అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నవలా నాయకుడిగా శోభన్ బాబు కీర్తి అందుకున్నారని, శోభన్ కు ఉన్నంత మంది మహిళా అభిమానులు మరో నటుడికి లేరని ఆయన అన్నారు. తాను తన జీవితంలోని హీరోను కోల్పోయానని ప్రముఖ సినీ నటి జయసుధ అన్నారు. తనకు శోభన్ బాబు హీరోయిన్ గా జీవితాన్ని ఇచ్చారని ఆమె అన్నారు. శోభన్ బాబుతో తనకు గల సాన్నిహిత్యాన్ని మురళీమోహన్ నెమరేసుకున్నారు.












Click it and Unblock the Notifications