మూర్ఛతోనే రైతు మృతి: రఘువీరా
హైదరాబాద్: మూర్ఛ రోగంతోనే వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో రైతు మరణించాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ఎరువుల కోసం జరిగిన తొక్కిసలాటలో ఉప్పలయ్య అనే రైతు మరణించిన విషయం తెలిసిందే. ఎరువులపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తొక్కిసలాటలో రైతు మరణించాడని అనడం నిజం కాదని ఆయన అన్నారు. మరణించిన రైతు కుటుంబానికి ప్రభుత్వం లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించింది.
ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రైతు మరణం సంఘటనకు సంబంధిచిన ఆందోళన సద్దమణిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి వంటి నాయకులు రాస్తారోకోలు చేస్తున్నారని ఆయన అన్నారు. రెండు, మూడు జిల్లాల్లో తప్ప ఎక్కడా ఎరువుల కొరత లేదని ఆయన అన్నారు. రైల్వై వ్యాగన్లు ఆలస్యంగా రావడం వల్లనే కొంత సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. ఎరువులు, విత్తనాల పంపిణీపై ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి సమీక్ష జరిపారు.












Click it and Unblock the Notifications