వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇకపై: నెరవేరిన భక్తుల చిరకాల కోరిక
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించేలా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అడుగు వేసింది. రోజురోజుకూ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అవుతున్న నేపథ్యంలో టీటీడీ ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇకపై నూతన వసతి అందుబాటులోకి వచ్చింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో నూతనంగా ఆధునీకరించిన డిస్పెన్సరీని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ అధికారులు దీన్ని ప్రారంభించారు. క్యూ లైన్లలో నిరీక్షించే భక్తులకు అత్యవసర వైద్య సేవలను మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని అత్యాధునిక వసతులతో పునర్నిర్మించారు.

ఈ ఆధునిక డిస్పెన్సరీలో తక్షణ నిర్ధారణ కోసం ఈసీజీ యంత్రాల సదుపాయంతో పాటు, ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్స్, ఇతర అత్యవసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. నిరంతరం సేవలందించేందుకు నలుగురు అనుభవజ్ఞులైన డాక్టర్లు, 16 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారు. వీరు షిఫ్టుల వారీగా రోజుకు 24 గంటల పాటు భక్తులకు అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయంలో రోగులను అశ్విని ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు.
మరోవంక తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ ఇటీవల భక్తులను కొందరు దళారులు మోసం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడంతో టీటీడీ పలు సూచనల ఇచ్చింది. మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఎవరైనా దర్శనాలు, వసతి పేరుతో సంప్రదిస్తే వెంటనే టీటీడీ టోల్ ఫ్రీ నంబర్ 155257 కు ఫిర్యాదు చేయాల్సిందిగా భక్తులను సూచించింది.
వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని, ఇవి పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.
తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని కోరింది.












Click it and Unblock the Notifications