ఈ క్షణాన్ని ఆస్వాదించండి! యువతకు మోదీ బిగ్ మెసేజ్..
ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బయటకు వచ్చే యువ మేధావుల నిర్ణయాలే రేపటి భారత భవిష్యత్తును దిశా నిర్దేశం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఐఐటీ 57వ కాన్వొకేషన్ కి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని, విద్యార్థులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న తరుణంలో, ఐఐటీ ప్రయాణంలో తోడ్పడిన అధ్యాపకులను, తోటి సిబ్బందిని ఎప్పటికీ మరచిపోకూడదని పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్‌తో పాటు ఇతర ప్రతిష్టాత్మక పురస్కారాలను ఆయన స్వయంగా అందజేశారు. పతకాలు సాధించిన వారిలో బాలికల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటే బాగుండేదని, రాబోయే రోజుల్లో మహిళా శక్తి మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
ఆ కంగారు పక్కనపెట్టి... ఈ క్షణాన్ని ఆస్వాదించండి!
క్యాంపస్ నుంచి బయటకు అడుగుపెడుతున్న వేళ ప్రతి విద్యార్థి మనసులో భవిష్యత్తుపై రకరకాల ఆలోచనలు, కొంత ఆందోళన ఉంటాయని ప్రధాని గుర్తుచేశారు. కొందరు మొదటి జీతం కోసం, మరికొందరు సరికొత్త నగరాల్లో ప్రయాణం కోసం, ఇంకొందరు తమ సొంత స్టార్టప్ కలల కోసం ఎదురుచూస్తుంటారని చెప్పారు. లక్ష్యాలు వేరైనా ప్రతి ఒక్కరిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందనే ఉత్సాహం సమానంగా ఉంటుందన్నారు. ప్రశ్నించడం కాదు.. సమస్యకు పరిష్కారం కనుగొనడంపై దృష్టిపెట్టాలన్నారు. బాధ్యతలు పెరిగేకొద్దీ గతం వైపు చూసుకుంటే ఈ క్యాంపస్ జ్ఞాపకాలే కొత్త శక్తిని ఇస్తాయని, అందుకే విద్యాబుద్ధులు నేర్పిన ప్రొఫెసర్లకు, అడుగడుగునా సహకరించిన నాన్-టీచింగ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకోవాలని సూచించారు.

పరమ్ ప్రజ్ఞ సూపర్ కంప్యూటింగ్ ప్రారంభం
ఈ పర్యటనలో భాగంగా ఐఐటీ ఢిల్లీకి చెందిన సోనిపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన 'పరమ్ ప్రజ్ఞ' అనే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటింగ్ సదుపాయాన్ని ప్రధాని ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో నూతన పరిశోధనలకు ఈ సూపర్ కంప్యూటర్ ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచంలో నూతన సాంకేతికతను ఒడిసిపట్టుకున్న వారే అగ్రస్థానంలో నిలుస్తారని వివరించారు.
అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించాలి
ప్రపంచ దేశాల మధ్య అధికార సమీకరణలు ఇప్పుడు సాంకేతిక పురోగతి ఆధారంగానే మారిపోతున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. రాబోయే 20-30 ఏళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, నిరంతరం నేర్చుకునే తత్వమే విజయాన్ని అందిస్తుందన్నారు. ప్రతి తరం ముందు కొన్ని సవాళ్లు ఉంటాయని, భారత్ దృఢంగా నిలబడాలంటే ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో సంపూర్ణ స్వయంసమృద్ధి సాధించక తప్పదన్నారు. చిప్స్ తయారీ నుంచి నౌకల నిర్మాణం వరకు అన్నీ మన దేశంలోనే, మన యువత చేతుల మీదుగానే జరగాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీలో మన యువత సృష్టిస్తున్న అద్భుతాలను ఈ సందర్భంగా కొనియాడారు.
పరిశోధనలకు లక్ష కోట్ల నిధులు
దేశంలో సైన్స్, రీసెర్చ్‌లను పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చిందని ప్రధాని పునరుద్ఘాటించారు. పరిశోధన విభాగానికి రూ.1 లక్ష కోట్లకు పైగా నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, పీఎం రీసెర్చ్ ఫెలోషిప్‌లు ప్రతిభావంతులకు అండగా నిలుస్తున్నాయన్నారు. 'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్' పథకం ద్వారా ప్రపంచస్థాయి పరిశోధనా పత్రాలు, జర్నల్స్ నేడు దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు కూడా ఉచితంగా అందుబాటులోకి వచ్చాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు.




Click it and Unblock the Notifications