మోడీ స్వరాష్ట్రంలో బీజేపీకి వరుస షాక్ లు..! అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓటములు..!
గుజరాత్ లో బీజేపీ (BJP) దశాబ్దాలుగా సాగిస్తున్న సుస్దిర రాజకీయానికి వెన్నెముకగా నిలిచిన సహకార చక్కెర రంగంలో ఇప్పుడు పరిస్ధితులు క్రమంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ది పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు సహకార ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన మోడీ స్వరాష్ట్రంలో ఇప్పుడు కాషాయ పార్టీలు వరుస షాకులు తప్పడం లేదు.
దక్షిణ గుజరాత్‌లోని కీలకమైన చక్కెర సహకార సంఘాల ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుల ప్యానెళ్లు ఓటమిపాలు కావడం, అసమ్మతి నేతలు స్వతంత్రంగా సవాల్ విసరడం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర కలవరం సృష్టిస్తోంది. చక్కెర సంఘాలలో మితిమీరిన రాజకీయ జోక్యంపై స్థానిక రైతుల్లో వచ్చిన వ్యతిరేకత ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద చక్కెర సహకార కర్మాగారాల్లో ఒకటైన బార్డోలి షుగర్ (శ్రీ ఖేదూత్ సహకారి ఖాండ్ ఉద్యోగ్ మండలి)లో గత 20 ఏళ్ల బీజేపీ పట్టు సడలింది. ఇక్కడి మొత్తం 15 స్థానాలలో బీజేపీ తిరుగుబాటు నేతలు, కాంగ్రెస్ ప్రతినిధులతో కూడిన కిసాన్ పరివర్తన్ ప్యానెల్ ఏకంగా 13 సీట్లు గెలుచుకుంది. అధికార బీజేపీ మద్దతున్న ప్యానెల్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఓడిపోయిన వారిలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వర్ పరమార్ కూడా ఉన్నారు.

సహకార రంగంలో బీజేపీ రాజకీయాల జోక్యమే ఆ పార్టీ ఓటమికి కారణంగా తెలుస్తోంది. తాజాగా సాయణ్ షుగర్ ఎన్నికల్లోనూ అధికార బీజేపీ ప్యానెల్ కేవలం 6 సీట్లకే పరిమితం కాగా, రెబెల్స్, స్వతంత్రులు పైచేయి సాధించారు. పార్టీ విధివిధానాల పేరిట అభ్యర్థులపై బీజేపీ ఒత్తిడి తేవడాన్ని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాండేవి, కమ్రేజ్ వంటి చోట్ల భాజపా మద్దతు ప్యానెళ్లు విజయం సాధించినా.. అక్కడ సొంత పార్టీకి చెందిన వివిధ గ్రూపుల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు, దక్షిణ గుజరాత్‌లో వేగంగా జరుగుతోన్న పట్టణీకరణ, బుల్లెట్ రైలు వంటి ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల కారణంగా సాగు భూమి తగ్గిపోవడం ఈ పరిశ్రమను దెబ్బతీస్తోంది. పెట్టుబడి ఖర్చులు పెరగడంతో బార్డోలి కర్మాగారంలో చెరకు క్రషింగ్ సామర్థ్యం గత మూడేళ్లలో 17 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 11.51 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. రానున్న కొద్ది వారాల్లో మధి, మహువా సహకార సంఘాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ నష్టనివారణ చర్యలకు దిగుతోంది.














Click it and Unblock the Notifications
