ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఫైనల్? టీమిండియాకు 'గోల్డెన్' ఛాన్స్!
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పోటీల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ టోర్నీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మ్యాచ్‌ల నిర్వహణను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వర్షం కారణంగా ప్రాక్టీస్‌కు కూడా సరైన అవకాశం లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే నేరుగా సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాల్సి వచ్చింది.
క్వార్టర్ ఫైనల్స్ రద్దు.. సెమీస్ చేరిన జట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా టోర్నీలోని నాలుగు క్వార్టర్ ఫైనల్స్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. ఇలాంటి సమయంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రామాణికంగా తీసుకుని నిర్వాహకులు అర్హత సాధించిన జట్లను నిర్ణయించారు. ఐసీసీ నంబర్-1 స్థానంలో ఉన్న భారత్‌తో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్లో భారత్-శ్రీలంక, రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.

ప్రాక్టీస్ లేకపోవడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
జపాన్ చేరుకున్నప్పటి నుంచి వర్షం పడుతుండటంతో భారత జట్టు టోక్యో సమీపంలో కేవలం ఐదు ఓవర్ల ద్వైపాక్షిక మ్యాచ్ మాత్రమే ఆడగలిగింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దయ్యే ముందు తగినంత ప్రాక్టీస్ లేకపోవడం ఒకింత ఇబ్బందికరమైన విషయమేనని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంగీకరించాడు. అయినప్పటికీ ప్రొఫెషనల్ క్రికెటర్లుగా వాతావరణాన్ని సాకుగా చూపించలేమని, శ్రీలంకపై మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
స్టేడియం పరిస్థితులు, పిచ్ స్వభావం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పిచ్‌లో తేమ ఎక్కువగా ఉంది. దీనివల్ల సెమీఫైనల్స్ జరిగే పిచ్‌లు చాలా నెమ్మదిగా స్పందించే అవకాశం ఉంది. బ్యాటర్లతో పాటు బౌలర్లు, ఫీల్డర్లు కూడా ఈ స్టేడియం పరిస్థితులకు త్వరగా అలవాటు పడాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి ప్రధాన ఆటగాళ్లు లేని శ్రీలంక జట్టును ఎదుర్కోవడం భారత జట్టుకు పెద్ద కష్టం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయంటే?
ఒకవేళ గురువారం జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం నంబర్-1 స్థానంలో ఉన్న భారత్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. శ్రీలంక 9వ స్థానంల ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రెండో సెమీఫైనల్ కూడా రద్దయితే మెరుగైన ర్యాంకింగ్ 6వ స్థానం ఉన్న పాకిస్తాన్ ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ శనివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం పడి రద్దయితే.. నియమావళి ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్లు ఉమ్మడిగా స్పర్ణ పతకాన్ని పంచుకుంటాయి.














Click it and Unblock the Notifications
