స్థానిక ఎన్నికల్లో కీలక సీట్లపై బీజేపీ గురి, ఢిల్లీ డెరెక్షన్ - మారుతున్న లెక్కలు..!!
స్థానిక ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ నెల చివరి వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కూటమి - వైసీపీ ఈ ఎన్నిక లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. కూటమి పార్టీలు ఏకపక్షంగా విజయం సాధించాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇదే సమయంలో సీట్ల షేరింగ్ పైన బీజేపీ, జనసేన నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బీజేపీ ఢిల్లీ నాయకత్వం స్థానిక ఎన్నికల్లో పోటీ.. పార్టీ సీట్ల పైనా కీలక దిశా నిర్దేశం చేసింది. దీంతో.. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
స్థానిక ఎన్నికల్లో జనసేనతో పాటుగా బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. తమకు ఇచ్చే సీట్ల సంఖ్య ఈ సారి ఎక్కువగా ఉండాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం ఈ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే విధంగా వ్యూహాలు ఉండాలని ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర నేతలకు నిర్దేశించింది. అందులో భాగంగా బీజేపీ నాయకత్వం ప్రస్తుతం పలు కార్పోరేషన్లు .. మున్సిపాల్టీల తో పాటుగా జెడ్పీల పైనా కన్నేసింది. విశాఖ, రాజమండ్రి, తిరుపతి గుంటూరు కార్పోరేషన్లు తమకు కేటాయించాలని కోరుతోంది. బీజేపీ 1979లో కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మరీ ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు జనసంఘ్ రూపంలో ఉన్న బీజేపీ.. తొలిసారి విశాఖ మేయర్ అభ్యర్థిని గెలిపించుకొని చరిత్ర లిఖించింది. విశాఖ గ్రేటర్ పరిధి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొంత విస్తరించి ఉంటుంది. అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్ధి గెలుపొందారు. దీంతో.. విశాఖ మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ లిస్టుకు ఆమోదం లభించేనా..?
అదే విధంగా విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలపై కూడా బీజేపీ ఫోకస్ చేసింది. ఇదే విజయవాడ సీటు కోసం జనసేన సైతం పట్టు బడుతోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే, మరో ఎంపీ ఉన్నారు. 2014లో కూడా విశాఖ ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. దీంతో తమకు పట్టున్న చోట మేయర్ సీటు దక్కించుకొని.. స్థానికంగా బలోపేతం కావాలనే వారి వ్యూహం. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న బీజేపీ.. బెజవాడ మేయర్ సీటును సైతం కోరాలని డిసైడ్ అయింది. తిరుపతి మేయర్ స్థానం కూడా తమకే ఇవ్వాలని కోరేందుకు సిద్దమయ్యారు. ప్రధానంగా ఈ మూడు కార్పోరేషన్లతో పాటుగా మూడు జెడ్పీ ఛైర్మన్లు.. పదికి తగ్గకుండా మున్సిపాల్టీలు తమకు కేటాయించే విధంగా జాబితా తో కూటమి నేతల భేటీలో చర్చించాలని భావిస్తున్నారు. దీంతో.. బీజేపీ కోరుకుంటున్నట్లుగా సీట్ల కేటాయింపు ఉంటుందా .. టీడీపీ నాయకత్వం ఆలోచన ఏంటి... కూటమిలో సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
