కాంగ్రెస్ ను వీడనున్న దామోదర్ రెడ్డి?
హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన రాష్ట్ర ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లా రాజకీయ వ్యవహారాల పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన పార్టీని వీడడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు వి. పురుషోత్తమ రెడ్డితో ఆయనకు తీవ్రమైన విభేదాలున్నాయి. ఆలేరు ఉప ఎన్నికల విషయంలో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఒకటి, రెండు రోజుల్లో దామోదర్ రెడ్డి పార్టీని వీడే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి లాజరస్ ఓడిపోవడానికి పురుషోత్తమరెడ్డే కారణమని, పురుషోత్తమరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దామోదర్ రెడ్డి వర్గం డిమాండ్ చేస్తూ వచ్చింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ వద్ద ధర్నాకు కూడా కూడా దిగింది. నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరువురు నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పురుషోత్తమరెడ్డి కింద పడిపోయారు. పలు మార్లు పురుషోత్తమరెడ్డి, దామోదర్ రెడ్డి బహిరంగంగా పరస్పర విమర్శలు చేసుకున్నారు. అయితే, దామోదర్ రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ సాన్నిహిత్యం వల్లనే దామోదర్ రెడ్డికి మంత్రి పదవి లభించింది.












Click it and Unblock the Notifications