తౌకీర్ ఇంట్లోనే ఉన్నా: బషీర్
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన బెంగుళూర్, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి ప్రధాన నిందితుడు అబూ బషీర్ ప్రధానమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నగరాల్లోని పేలుళ్లకు గల సంబంధాన్ని కూడా అతను చెప్పినట్లు సమాచారం. గుజరాత్ లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత పోలీసులు బషీర్ ను గురువారం ఢిల్లీకి తెచ్చారు. ఇటీవలి పేలుళ్లకు సంబంధించి బషీర్ ముఖ్యమైన వ్యక్తి అని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
విచారణలో బషీర్ చాలా విషయాలు చెప్పాడని గుజరాత్ పోలీసులు అంటున్నారు. తనకు ఢిల్లీ పేలుళ్ల గురించి తెలుసునని అతను చెప్పినట్లు వారు తెలిపారు. అబూ బషీర్ అరెస్టు జరిగిన వెంటనే ఢిల్లీ పోలీసులు తమ వద్దకు వచ్చారని, తాము ఢిల్లీ పేలుళ్లకు 20 రోజుల ముందే అన్ని విషయాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెప్పామని గుజరాత్ పోలీసులు అంటున్నారు. బషీర్ ఢిల్లీలో పేలుళ్ల వెనక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌకీర్ ఇంట్లో ఉన్నట్లు చెబుతున్నారు.
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో సిమీ కార్యకర్త అబూ బషీర్ ను పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. హైదరాబాదులోని జంట పేలుళ్ల కేసుతో కూడా అతనికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. జులైలో ఢిల్లీలోని జకీర్ నగర్ లోని తౌకీర్ ఇంట్లో తాను ఉన్నట్లు బషీర్ పోలీసులకు చెప్పాడు. తౌకీర్ ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడు. అతని కోసం ఢిల్లీ పోలీసులు అన్వేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications