సినీ దిగ్గజం బిఆర్ చోప్రా కన్నుమూత

సామాజిక సమస్యలపై తీసిన చిత్రాలు చోప్రాకు బాగా పేరు సంపాదించిపెట్టాయి. ధూల్ కా ఫూల్, వక్త్, నయా దౌర్, కానూన్, హమ్‌రాజ్, ఇన్సాఫ్ కా తరాజు, నిఖా లాంటి చిత్రాలు ఆయనకు బాలీవుడ్‌లో అగ్రస్థానం కట్టబెట్టాయి. చలనచిత్ర రంగానికి అందించిన సేవలకు గుర్తుగా 1999లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనను వరించింది. 1914 ఏప్రిల్ 22న అవిభక్త పంజాబ్‌లో జన్మించిన చోప్రా పూర్తి పేరు బల్దేవ్ రాజ్ చోప్రా. ఆయన సినీ జీవితం మొదట చలనచిత్ర విలేఖరిగా ప్రారంభమైంది. భారత్ నుంచి పాక్ విడిపోయిన తర్వాత ఢిల్లీకి, తర్వాత ముంబయికి వచ్చిన బి.ఆర్.చోప్రా 'సినీ హెరాల్డ్ జర్నల్'కు సినిమా సమీక్షలు రాసేవారు. 1949లో ఆయన తన తొలిచిత్రం 'కర్వత్' తీశారు. అది ప్రజాదరణ పొందలేదు. నిరాశచెందకుండా 1951లో తనే నిర్మాత, దర్శకుడిగా 'అఫ్సానా' చిత్రాన్ని రూపొందించారు. అది సంచలనం సృష్టించింది. సిల్వర్ జూబ్లీకి పరుగులు తీసింది. నాటి నుంచీ ఆయన వెనుదిరిగి చూడలేదు. 1955లో తన సొంత బ్యానర్ బి.ఆర్.ఫిల్మ్స్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్ కింద రూపొందిన తొలి చిత్రం 'నయా దౌర్'(1957) భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు వితంతువుకు పెళ్లి నేపథ్యంతో తీసిన 'ఏక్ హీ రాస్తా' చిత్రం అప్పట్లో సంచలనాత్మక విజయాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత సాధన, కానూన్, గుమ్రా, హమ్‌రాజ్ చిత్రాలు తీసిన ఆయన వరుసగా హిట్‌లు కొట్టారు.
1985లో బి.ఆర్.ఫిల్మ్స్ బుల్లి తెరలోకి అడుగుపెట్టింది. 1988లో తీసిన మహాభారత్ సీరియల్ భారీ విజయం నమోదు చేసింది. అది ప్రపంచవ్యాప్తంగా 96 శాతం ప్రేక్షకాదరణతో గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించింది. డబ్బు, కథనాయకులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం లాంటి అంశాలు ప్రస్తుతం చలనచిత్ర రంగాన్ని భ్రష్టుపట్టించాయని చోప్రా అభిప్రాయపడుతుండేవారు.












Click it and Unblock the Notifications