బిజెపి ఎమ్మెల్యే ఆత్మహత్య
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సిట్టింగ్ శాసనసభ్యుడు, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పూరన్ చంద్ యోగి తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. 73 ఏళ్ల యోగి మృతదేహం ఢిల్లీలోని ఇందర్ పురిలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. మూడు విడతలుగా శాసనసభ్యుడిగా ఉంటున్న యోగికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి రమాకాంత్ గోస్వామి పోటీ చేస్తున్నారు. యోగి తీవ్రంగా ప్రచార కార్యక్రమాలు చేపడూతూ వస్తున్నారు.
తన భర్త యోగి ఉదయం 5 గంటల ప్రాంతంలో నిద్రలేచి పై అంతస్థులోని గది తాళం చెవులు అడిగారని, ఆ గదిలో ఎన్నికల ప్రచార సామగ్రి ఉందని. తాను ఉదయం ఏడుంబావు ప్రాంతంలో ఆ గదికి వెళ్లే సరికి యోగి మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందని యోగి భార్య పోలీసులకు వివరించారు. యోగి గుండెపోటుతో మరణించాడని అంతకు ముందు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. అంతకు ముందు ఇండియన్ ఆక్సిజన్ లిమిటెడ్ లో పని చేసిన యోగికి కుమారుడు, కూతురు ఉన్నారు. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి వికె మల్హోత్రా యోగి ఇంటిని సందర్శించారు.
పాకిస్తాన్ లోని గుజరన్ వాలా జిల్లాలో యోగి 1935లో జన్మించారు. 1967 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. మొదటి సారి 1993లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లోనూ, 2003లోనూ శాసనసభ్యుడిగా గెలుపొందారు. యోగి మరణంతో ఎన్నిక వాయిదా పడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications