కొనసాగుతున్న తెలంగాణ బంద్
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణాకోసం ఈ పార్లమెంట్ సమావేశాల్లో నే బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ పలు పార్టీలు, సంఘాలు బుధవారం తెలంగాణా బంద్‌కు దిగాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావి సంఘాలు ఇచ్చిన ఈ బంద్ పిలుపునకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపి), భారతీయ జనతా పార్టీ (బిజెపి), బీఎస్పీ మద్దతు పలికాయి. బుధవారం ఉదయం నుంచే తెరాస, ఇతర పార్టీల నేతలు ఆయా జిల్లాల్లో బస్‌డిపోల ముందు విద్యాసంస్థలముందు బైఠాయించారు. దీంతో బస్సులు తిరగటంలేదు. ఆందోళనకారులు అడ్డుపడటంతో పలు స్కూళ్లలో అర్థసంవత్సర పరీక్షలు వాయిదాపడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో బంద్‌తో 650 బస్సులు రద్దుకాగా వరంగల్‌లో 243, కరీంనగర్‌లో 250 రద్దయ్యాయి. గోదావరిఖనిలో తెరాస కార్యకర్తలు డిపోముందు బైఠాయించటంతో బస్సులు బయటకే రాలేదు.
మెదక్‌లో తెరాస నేత పద్మా దేవేందర్‌రెడ్డి, సిద్ధిపేటలో హరీష్‌రావు, దుబ్బాకలో రామలింగారెడ్డి బస్‌డిపోల ముందు తెరాస కార్యకర్తలతో బైఠాయించారు. మహబూబ్‌నగర్‌లో ఆందోళన సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీరాణి అరెస్టయ్యారు. ఖమ్మంలో మాత్రం బంద్ పాక్షికంగా ఉంది. బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, తార్నాకా ప్రాంతాల్లో తెలంగాణ విద్యార్థి సంఘాల కార్యకర్తలు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్ ను విజయవంతం చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పలు చోట్లు పెట్రోల్ బంకులు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బంద్ సందర్భంగా ఆందోళనకారులు కొన్ని చోట్ల బస్సులపై దాడి చేశారు. దీంతో బస్సులు ధ్వంసమయ్యాయి.












Click it and Unblock the Notifications