హైదరాబాద్: 'నేను రియలైజ్ అయ్యాను' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తులకు నచ్చచెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. జన్మభూమి వంటి కార్యక్రమాల పేరుతో ఉద్యోగులను పరుగులు పెట్టించానని వాపోయారు. అభివృద్ధి చేయాలన్న కోరికే తన చేత అలా చేయించిందని.. ఇకపై ఉద్యోగులను ఇబ్బంది పెట్టనని అన్నారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రచురించిన డైరీని మంగళవారం చంద్రబాబు తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. తన కార్యక్రమాల కారణంగా కోపించిన ఉద్యోగులు తనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఈ సారి తాను అధికారంలోకి వస్తే ఇబ్బంది పెట్టబోనని ఉద్యోగులకు అభయమిచ్చారు. అంతా కలసి ఒకే కుటుంబంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.పీఆర్‌టీయూ నేత మోహన్‌రెడ్డిని నమ్ముకోవద్దని, అతను ఎటువైపుంటే అటువైపు నాశనమేనని దుయ్యబట్టారు.