సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
చెన్నై: సాఫ్ట్‌వేర్ రంగంలో తలెత్తుతున్న సంక్షోభంతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సెంబియం పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన విశ్వ వెంకటేశన్ (23) చెన్నైలోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల బయల్పడిన సత్యం కంప్యూటర్స్ ఉదంతం, సాఫ్ట్‌వేర్ రంగంలో ఎదురౌతున్న ఆటుపోట్లు వెంకటేశన్‌కు ఆందోళన కల్గించాయి.
ఉద్యోగంపోతే రోడ్డున పడాల్సి వస్తుందేమోనని భయపడ్డాడు. ఇదే విషయాన్ని స్నేహితులతో పలుమార్లు చర్చించాడు. మంగళవారం సాయంత్రం స్థానిక తాంబరంలో వుంటున్న స్నేహితుని వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి బుధవారం ఉదయం ఉత్తర చెన్నైలోని అగరంలో వున్న తన రూంకు బయలుదేరాడు. మార్గమధ్యంలో విషం సేవించాడు. ఇది గ్రహించిన స్నేహితులు వెంకటేశన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందాడు.
సాఫ్ట్‌వేర్ రంగంలో తలెత్తుతున్న సంక్షోభంతో మనస్తాపం చెందే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు అతని స్నేహితులు చెబుతున్నారు. అయితే కొన్ని రోజులుగా అతను అనారోగ్యంతో బాధ పడుతున్నాడని, అందువల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతున్నారు. ఈ నెల 9న కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడని, స్నేహితులు గమనించి ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాలతో బయట పడ్డాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications